- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DCM:‘నా పిఠాపురం ప్రజలారా’.. ఉగాది సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆత్మీయ లేఖ!
'ప్రియమైన నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు..' అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 'ప్రియమైన నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు..' అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఒక బహిరంగ లేఖను రాశారు.. అందులోని విశేషాలు ఆయన మాటల్లోనే.. 'ఎన్నో ఆశలతో, మరెన్నో ఆకాంక్షలతో తెలుగు వారి నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని శ్రీ పురుహూతికా అమ్మవారిని, శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారిని, శ్రీపాద వల్లభ స్వామివారిని వేడుకుంటున్నాను.
పిఠాపురం నుండి మీరు ఎంతో ప్రేమాభిమానాలతో నన్ను మీ శాసనసభ్యునిగా ఎన్నుకున్న తర్వాత వస్తున్న తొలి ఉగాది ఈ విశ్వావసు నామ సంవత్సరం పిఠాపురం సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నాంది పలుకుతుందని నేను విశ్వసిస్తున్నాను. మీరు నన్ను పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిపిస్తే, మీరిచ్చిన విజయం నాకు ఉపముఖ్యమంత్రి పదవితో పాటుగా, పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు అందించింది. ఆ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో నేను రాష్ట్రవ్యాప్తంగా దృష్టి పెట్టాల్సి ఉంది.
నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినప్పటికీ, అనుక్షణం నా పిఠాపురం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాను. మాటలు చెప్పడం కంటే, పని పూర్తి చేయడం ముఖ్యమని నేను భావిస్తాను. నేను కనిపించడం కంటే, నా పని మీకు కనిపించాలి. దాని ద్వారా మిమ్మల్ని మెప్పించాలి అనే ఉద్దేశ్యంతో గత పది నెలల కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను, దీర్ఘకాలిక సమస్యలను అధ్యయనం చేస్తూ, పరిష్కరిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ పలు కార్యక్రమాలను చేపట్టాను. పిఠాపురం పరిసర ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రంగాల్లో పిఠాపురం అభివృద్ధే ధ్యేయంగా అడుగులు వేస్తూ. నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాను. భవిష్యత్తులో పిఠాపురం గురించి దేశవ్యాప్తంగా చర్చించేలా పిఠాపురం అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేయాలనేదే నా ఉద్దేశం. ఈ బృహత్కార్యానికి మీ అందరి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.






