మాట నిలబెట్టుకున్నాం.. డబ్బులు జమ చేశాం: పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని విడుదల చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు...

మాట నిలబెట్టుకున్నాం.. డబ్బులు జమ చేశాం: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారుల(Fishermen)కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని విడుదల చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pwan Kalyan) తెలిపారు. మత్స్యకారుల సేవలో పథకం కింద అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రూ.10 వేలు మాత్రమే ఇవ్వగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి ఇస్తుందని చెప్పారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుందన్నారు. కాకినాడ జిల్లాలో 24,930 మంది లబ్ధిదారులకు రూ.49.86 కోట్ల మేర, పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మంది లబ్ధిదారులకు రూ.13.79 కోట్ల మేర లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు.

మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా అడుగులు

‘‘కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీరం పరిధిలో ఉన్న 23 ల్యాండింగ్ సెంటర్లు, 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో పథకాలు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. 4,578 బోట్లకుగాను 91.48 లక్షల లీటర్ల డీజిల్‌పై ప్రభుత్వం రూ.8.23 కోట్ల రూపాయల సబ్సిడీని అందించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, డిఆర్డీఏ సహకారంతో ఇంజన్లు, వలలు, బోట్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రూ.1.13 కోట్ల రూపాయల సబ్సిడీ అందించింది. కోనపాపపేట గ్రామంలో మత్స్యకారుల కోసం రూ.2 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నాం. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం ప్రభుత్వం ఉచితంగా 100 శాతం సబ్సిడీపై ట్రాన్స్ పాండర్స్ ఇస్తోంది. ఇవి తుపానులు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడతాయి. సముద్రంలో జీవవైవిధ్యాన్ని, చేపల సంఖ్యను పెంచడానికి జిల్లాలో 20 స్థలాలను ఎంపిక చేశారు. ఒక్కో చోట రూ. 20 లక్షల వ్యయంతో ఆర్టిఫిషియల్ రీప్స్ ఏర్పాటు చేస్తున్నాం. సముద్ర తాబేళ్లను రక్షించేందుకు వీలుగా అన్ని ట్రాలింగ్ బోట్లకు ఉచితంగా టెడ్ పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.

Next Story