ఇవే చంద్రబాబులోని ముందుచూపునకు నిదర్శనం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

భవిష్యత్తును ఊహించి ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు.

ఇవే చంద్రబాబులోని ముందుచూపునకు నిదర్శనం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భవిష్యత్తును ఊహించి ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు(Chandrababu) తొలిసారి ప్రమాణం చేసి నేటికి 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పాలనా దక్షతతో చేపట్టిన కార్యక్రమాలు, సంస్కరణలతో తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని పరుగులు పెట్టించాయి. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన ముద్ర చిరస్మరణీయం. పాలనలో ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా వాటిని సవాళ్ళుగా స్వీకరించి ముందడుగు వేశారు. హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో కొండలు గుట్టలుగా ఉన్న ప్రాంతాన్ని ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చిన ఘనత చంద్రబాబుదే. 90ల్లో ఆయన ఐటీకి పెద్దపీట వేయడం మూలంగానే తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామాల నుంచి ఐటీ ఉద్యోగులు వచ్చారు.

రైతు బజార్లు ఏర్పాటు, డ్వాక్రా సంఘాల స్థాపన, పేదలకు వెలుగు ప్రాజెక్ట్ ప్రారంభం, మీసేవా కేంద్రాలు ఏర్పాటు లాంటి నూతన ఆవిష్కరణలు చంద్రబాబులోని ముందుచూపును తెలియచేశాయి. రాష్ట్ర విభజన అనంతరం క్లిష్ట సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌ను ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లారు. ప్రజా రాజధానిగా అమరావతి, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్.. వీటితోపాటు పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా 2014లో పాలన మొదలుపెట్టారు. 2024లోనూ మరింత క్లిష్ట పరిస్థితుల్లో పాలన పగ్గాలు తీసుకున్నారు.

కఠిన సవాళ్ళు ముందున్నా దృఢ చిత్తంతో పాలన వ్యవస్థను ముందుకు తీసుకువెళ్తున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అభివృద్ధి పనులు, వివిధ ప్రాజెక్టులకు నిధులు సాధించడం చంద్రబాబు నాయకత్వ లక్షణాలు తెలియచేస్తాయి. పాలన వ్యవహారాల్లో సాంకేతికతను వినియోగిస్తూ, ప్రజలకు సత్వర సేవలు అందేలా చేస్తున్నారు. దార్శనికత కలిగిన చంద్రబాబు నిర్దేశకత్వంలో మా మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిబద్ధతతో పని చేస్తోంది అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story