తెలుగు రాష్ట్రాల మధ్య వైసీపీ-బీఆర్ఎస్‌ చిచ్చు పెట్టే కుట్ర : పట్టాభిరామ్ తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడారు. వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలే రాజకీయ లబ్ధి కోసం తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య వైసీపీ-బీఆర్ఎస్‌ చిచ్చు పెట్టే కుట్ర : పట్టాభిరామ్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలు, రైతులు బాగుండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు విధానమని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలే రాజకీయ లబ్ధి కోసం తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడుతూ.. రెండు పార్టీల అధికారిక పత్రికలు ‘సాక్షి’, ‘నమస్తే తెలంగాణ’ సమన్వయంతో తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. చంద్రబాబు రెండు రాష్ట్రాల అభివృద్ధిని కోరుకుంటే, వైసీపీ-బీఆర్ఎస్ మాత్రం కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.

రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కేసీఆర్ వ్యాఖ్యలను జగన్ ఖండించక పోగా ప్రశంసించారని గుర్తు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలోనూ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. ఎన్జీటీ అభ్యంతరాలపై జగన్ ప్రభుత్వం స్పందించకపోవడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన ఆస్తులను కాపాడుకోవడానికే జగన్ బీఆర్ఎస్ నేతలతో స్నేహం చేస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

Next Story