ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూసి ‘పప్పుకూర’ ప్రయోగం.. ఒకే కుటుంబంలో నలుగురి పరిస్థితి విషమం

by Bhoopathi Nagaiah |

పప్పులో ఉమ్మెత పూలు వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో చూసిన కుటుంబం అది నిజమని నమ్మి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూసి ‘పప్పుకూర’ ప్రయోగం.. ఒకే కుటుంబంలో నలుగురి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌డెస్క్ : సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి విషయాన్ని నిజమని నమ్మి ఆచరిస్తే ప్రాణాలకే ముప్పు అని ఈ ఘటన నిరూపించింది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎర్రంపాలెం గ్రామంలో ఈ విచారకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వంట వీడియోను చూశారు. అందులో ఉమ్మెత్త పువ్వును (Datura Flower) పప్పులో వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని చూపించినట్లు సమాచారం. అది నిజమని నమ్మిన కుటుంబ సభ్యులు, ఇంటి ఆవరణలో ఉన్న ఉమ్మెత్త పువ్వులను కోసి, పప్పులో వేసి వండుకుని తిన్నారు. పప్పు తిన్న కొద్దిసేపటికే కుటుంబ సభ్యులందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కళ్లు తిరగడం, స్పృహ తప్పిపోవడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి (GGH) తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో వీరలక్ష్మి, గంగాభవాని, జయలక్ష్మి, వీరబ్బులు ఉన్నారు.

బాధితుల బంధువులపై డాక్టర్లు సీరియస్

విషపూరితమైన ఉమ్మెత్త పువ్వులను కూర చేసుకోవడంపై వైద్యులు సీరియస్ అయినట్టు సమాచారం. ఉమ్మెత్త పువ్వులు అత్యంత విషపూరితమైనవని వైద్యులు తెలిపారు. ఉమ్మెత్త విషానికి నిర్దిష్టమైన విరుగుడు (Antidote) ఉండదని, కేవలం సపోర్టివ్ ట్రీట్‌మెంట్ ద్వారానే విష ప్రభావాన్ని తగ్గించాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. బాధితులను సరైన సమయంలో ఆసుపత్రికి చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు.

సోషల్ మీడియా.. ఏది నిజం ఏది అబద్దం..?

ఇటీవలి కాలంలో వ్యూస్ కోసం కొందరు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల్లో శాస్త్రీయత లేని చిట్కాలను, వంటలను ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర ప్రయోగాలను చేసే ముందు వాటి పర్యవసానాలను ఆలోచించాలని, ముఖ్యంగా విషపూరిత మొక్కల పట్ల అవగాహన కలిగి ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మెత్త (Datura) ఒక విషపూరితమైన మొక్క అని, దీని గింజలు, పువ్వులు తింటే నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతాయని వైద్యులు హెచ్చరించారు.

Next Story