ఏపీ అభివృద్ధిలో మా భాగస్వామ్యం కొనసాగుతుంది: సింగపూర్ మంత్రి కీలక ప్రకటన

by Yella Dhawani Reddy |

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సింగపూర్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఏపీ అభివృద్ధిలో మా భాగస్వామ్యం కొనసాగుతుంది:  సింగపూర్ మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ప్రస్తుతం సింగపూర్ (Singapoore) పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్‌లో దౌత్య కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. తాజాగా చంద్రబాబు ఆ దేశ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మంత్రి టాన్సీ లెంగ్ (Tansy Leung)తో భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై వారు చర్చించారు. రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని మంత్రి టాన్ సీ లెంగ్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. ఈ భేటీ అనంతరం టాన్సీ లెంగ్ కీలక ప్రకటన చేశారు. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటని, ఆ రాష్ట్రంలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని వెల్లడించారు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ , నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు టాన్సీ లెంగ్ ప్రకటించారు. ఈ సందర్భంగా 2014-2019లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి నాటి ప్రభుత్వంతో కలిసి పని చేశామని గుర్తుచేసుకున్నారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన, నిర్మాణ సహకారాన్ని అందించినట్టు గుర్తు చేశారు. అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ కూడా దక్కించుకున్నాయని తెలిపారు.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒప్పందంలో కొనసాగేందుకు సహకారం ఆగిపోయిందని పేర్కొన్నారు. ఆ కారణంగానే అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్టియం బయటకు వచ్చేసిందని వ్యాఖ్యానించారు. గత అనుభవాల కారణంగా సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సార్టియం పని చేయకున్నా.. అమరావతిలో, ఏపీలో పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో అభివృద్ది ప్రణాళికల్లో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.

Next Story