స్వర్ణాంధ్ర-2047 పైనే మా ఫోకస్​

by Thanuru Gopichand |

వన్ ఫ్యామిలీ, వన్ ఏఐ ప్రొఫెషనల్, వన్ ఎంట్రప్రెన్యూర్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని, దీనికి కేంద్ర సాయం అవసరమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు

స్వర్ణాంధ్ర-2047 పైనే మా ఫోకస్​
X

దిశ, డైనమిక్​బ్యూరో : వన్ ఫ్యామిలీ, వన్ ఏఐ ప్రొఫెషనల్, వన్ ఎంట్రప్రెన్యూర్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని, దీనికి కేంద్ర సాయం అవసరమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సచివాలయానికి ఇవాళ వచ్చిన సుమన్ బేరీకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను, అభివృద్ధి ఆకాంక్షలను ముఖ్యమంత్రి వివరించారు. ఆవిష్కరణలు-సాంకేతికత అందించడం, నూతన విధానాల అమలుకు తోడ్పడటంలో నీతి ఆయోగ్ సహకారాన్ని కోరారు. ఏపీ ఏటా 15 శాతం వృద్ధి రేటు సాధించి 2047 కల్లా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థను నెలకొల్పేందుకు, తద్వారా 42 వేల డాలర్ల తలసరి ఆదాయానికి అందరూ చేరుకునేలా ప్రయత్నిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నీతి ఆయోగ్ మద్దతు ఉంటే రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందని, వికసిత్ భారత్ 2047 సాధనలో ఏపీ మోడల్ స్టేట్‌గా ఉంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని 4 గ్రోత్ హబ్‌లో ఒకటిగా ఉన్న విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్)తో పాటు తిరుపతి-అమరావతిని రీజినల్ గ్రోత్ హబ్‌లుగా మలిచేందుకు నీతి ఆయోగ్ సహకారం అందించాలని సీఎం కోరారు. కేంద్రానికి – రాష్ట్రానికి ఇది అనుకూల సమయమని, అభివృద్ధికి ఎంతో ఆస్కారముందని, ఇందులో నీతి ఆయోగ్ భాగస్వామ్యం కూడా కచ్చితంగా ఉంటుందని సుమన్ బేరీ హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో తాను అభివృద్ధి చేసిన జినోమ్ వ్యాలీలో ఇప్పుడు 700 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో అత్యుత్తమ పాలసీలను ఏపీలో అమలు చేయాలనేది తమ విధానమని ముఖ్యమంత్రి చెప్పారు. 2029 కల్లా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో 11 వేలకు పైగా ఈవీ బస్సులను ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్టు, అలాగే రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లపైనా రూఫ్ టాప్ సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని చెప్పారు. సచివాలయానికి తొలిసారి వచ్చిన సుమన్ బేరీకి ఘనంగా స్వాగతం పలకడమే కాకుండా... సమావేశం అనంతరం ఆయన తిరిగి వెళ్లేటప్పుడు కారు దగ్గరకు వెళ్లి మరీ ముఖ్యమంత్రి వీడ్కోలు పలికారు.

Next Story