ఊపిరి పీల్చుకున్న రాజోలు దీవి.!

by Vemula.Srinu Prasad |

రాజోలు దీవి ప్ర‌జ‌ల‌ను కంటిమీద కునుకు లేకుండా చేసిన ఇరుసుమండ బ్లోఅవుట్‌ను ఓఎన్జీసీ నిపుణుల బృందం విజ‌య‌వంతంగా మూసివేశారు...

ఊపిరి పీల్చుకున్న రాజోలు దీవి.!
X

దిశ‌, అమ‌లాపురం: రాజోలు దీవి ప్ర‌జ‌ల‌ను కంటిమీద కునుకు లేకుండా చేసిన ఇరుసుమండ బ్లోఅవుట్‌ను ఓఎన్జీసీ నిపుణుల బృందం విజ‌య‌వంతంగా మూసివేశారు. అయిదు రోజుల పాటు ఇరుసుమండ ప్ర‌జ‌ల‌నే కాకుండా రాజోలు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల‌ను తీవ్ర క‌ల‌వ‌రానికి గురిచేసిన బ్లో అవుట్ సంభ‌వించిన గ్యాస్ వెల్‌కు క్యాప్ బిగించి బ్లోఅవుట్‌ను పూర్తిగా మూసివేశారు. ఇది పూర్తిగా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతోనే బ్లో అవుట్‌ను మూసివేయ‌గ‌లిగామ‌ని ఓఎన్జీసీ విప‌త్తు నివార‌ణ బృందం ప్ర‌క‌టించింది.. ప్ర‌స్తుతం ఓఎన్జీసీ వెల్‌కు బ్లో అవుట్ ప్రీవెన్ష‌న్‌(బీవోపీ) ఫిక్స్ చేసి గ్యాస్‌ను పూర్తిగా నియంత్రించామ‌ని తెలిపారు. దీంతో ముఖ్యంగా ఇరుసుమండ గ్రామ ప‌రిస‌ర ప్రాంత ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు.. తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైన ఇక్క‌డి ప్ర‌జ‌లంతా బ్లో అవుట్ మూసివేశార‌ని ఓఎన్జీసీ అధికారుల‌నుంచి అధికారిక స‌మాచారం రావ‌డంతోపాటు ఆవీడియోలు విడుద‌ల చేయ‌డంతో ప్ర‌శాంతంగా నిద్ర‌పోతామ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు తెలిపారు. బ్లో అవుట్‌ను శుక్ర‌వారం ఉద‌యం నాటికే మంట‌ల‌ను పూర్తిగా నియంత్రించిన నిపుణులు మ‌ధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో బ్లో అవుట్‌ వెల్ కు భారీ క్రైన్ ద్వారా క్యాప్ ను ఏర్పాటు చేయ‌డంతో బ్లో అవుట్ పూర్తిగా అదుపులోకి వ‌చ్చింది..

అయిదు రోజుల పాటు కంటిమీద కునుకులేకుండా..

అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలోని మ‌లికిపురం మండ‌లం ఇరుసుమండ గ్రామంలో మోరి -5 బావికు సంబందించి డ్రిల్లింగ్ సైట్లో ఈనెల 5న ఈ బ్లో అవుట్ సంభ‌వించింది. వెల్‌లోని సుమారు 2,700 మీట‌ర్లు లోతులో కోత్త జోన్ల‌లోకి వెళ్లేందుకు లాగింగ్ టూల్ టెస్టింగ్ ద్వారా బాంబింగ్ ప్ర‌క్రియ నిర్వ‌హిస్తుండ‌గా ఈప్ర‌మాదం జ‌రిగిందని ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. 1993లో మోరి-5 బావి ఉత్ప‌త్తిలోకి రాగా కాల‌క్ర‌మేనా ఉత్ప‌త్తి త‌గ్గడంతో పున‌రుద్ధ‌రించేందుకు 2024లో డీప్ ఇండ‌స్ట్రీ లిమిటెడ్ అనే ప్ర‌యివేటు సంస్థ‌కు లీజుకు ఇచ్చింది ఓఎన్జీసీ. ప్ర‌మాదం జ‌రిగే స‌మ‌యంలో పూర్తిగా ఈసంస్థ ఆదీనంలోనే ఉంది వెల్‌.. ఇదిలా ఉంటే అంచ‌నాల‌కు మించి 2500 పీఎస్ఐ పీడ‌నంతో గ్యాస్ ఒక్క‌సారిగా ఎగ‌ద‌న్నుతున్న క్ర‌మంలో గ్యాస్‌ను నియంత్రించేందుకు కెమిక‌ల్ మ‌డ్ పంపింగ్ విఫ‌ల‌మ‌య్యింద‌ని, గ్యాస్ సామర్థ్యాన్ని మించిపోవ‌డంతో రాపిడి వ‌ల్ల మంట‌లు అంటుకున్నాయ‌ని తెలిపారు. ఈ బ్లో అవుట్ వ‌ల్ల స్థానిక ప్ర‌జానికం ఇబ్బందులు ప‌డ్డార‌ని, డీప్ ఇండ‌స్ట్రీ లిమిటెడ్‌కు చెందిన రిగ్‌, లాగింగ్ టూల్స్‌, భారీ వాహ‌నాలు, జ‌న‌రేట‌ర్లు పూర్తిగా ద‌గ్ధం అయ్యాయ‌ని వెల్ల‌డించారు. స్థానికంగా పంట‌పొలాలు, కొబ్బ‌రి చెట్లు కాలిపోయాయ‌న్నారు. ఇదిలా ఉంటే రోజుల వ్య‌వ‌ధిలోనే బ్లో అవుట్‌ను విజ‌య‌వంతంగా నియంత్రించిన ఓఎన్జీసీ అధికారుల‌ను, నిపుణుల బృందాల‌ను అమ‌లాపురం ఎంపీ గంటి హ‌రీష్ బాల‌యోగి, మంత్రి వాసంశెట్టి సుభాష్‌, స్థానిక ఎమ్మెల్యే దేవ వ‌ర‌ప్ర‌సాద‌రావు, జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ లు అభినందించారు.

Next Story