ఇరుసుమండ బ్లో అవుట్‌ ఘటన.. బాధితులకు పరిహారం ప్రకటించిన ఓఎన్జీసీ

by Ramesh Naini |

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఇరుసుమండలో చోటుచేసుకున్న ఓఎన్జీసీ బ్లో అవుట్‌ బాధితులకు ఊరట లభించింది.

ఇరుసుమండ బ్లో అవుట్‌ ఘటన.. బాధితులకు పరిహారం ప్రకటించిన ఓఎన్జీసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఇరుసుమండలో చోటుచేసుకున్న ఓఎన్జీసీ బ్లో అవుట్‌ బాధితులకు ఊరట లభించింది. ఈ ఘటనపై స్పందించిన ఓఎన్జీసీ యాజమాన్యం, బాధితులకు భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మహేశ్‌ కుమార్‌, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌, ఓఎన్జీసీ ఈడీ శాంతందాస్ వివరాలను వెల్లడించారు.

6,300 కుటుంబాలకు ఆర్థిక సహాయం

ఇరుసుమండ బ్లో అవుట్‌ ప్రభావానికి గురైన నాలుగు గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఇరుసుమండ, గుబ్బల పాలెం, లక్కవరం, చింతలపల్లి ప్రభావిత గ్రామాలుగా గుర్తించారు. మొత్తం 6,300 కుటుంబాలు లబ్ధిదారులుగా నిర్ణయించారు. ఫిబ్రవరి మొదటి వారంలో నేరుగా బాధితుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఓఎన్జీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కేవలం నివాసితులకే కాకుండా, బ్లో అవుట్‌ వల్ల పంటలు నష్టపోయిన రైతులకు కూడా పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే వరప్రసాద్ డిమాండ్లు

పరిహారంతో పాటు స్థానికులకు శాశ్వత ప్రయోజనాలు కల్పించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలు చేశారు. లక్కవరంలో ఓఎన్జీసీ బ్రాండ్‌తో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలి.. బాధితులందరికీ రూ. 5 లక్షల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.. స్థానిక యువతకు ఓఎన్జీసీ సంస్థలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి.. అని డిమాండ్ చేశారు.

Next Story