- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన్ విజన్-వన్ డైరెక్షన్.. : సీఎం చంద్రబాబు
వన్ విజన్-వన్ డైరెక్షన్... (One Vision-One Direction) ఇదే ప్రభుత్వ విధానమని..

దిశ, వెబ్ డెస్క్ : వన్ విజన్-వన్ డైరెక్షన్... (One Vision-One Direction) ఇదే ప్రభుత్వ విధానమని.. దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో డేటా ఆధారిత పాలనపై ముఖ్యమంత్రి నేతృత్వంలో సదస్సు నిర్వహించారు.
సుపరిపాలన అందించాలి
సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) మాట్లాడుతూ...”దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలన్నారు. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించామని స్పష్టం చేశారు. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. నెలవారీ, త్రైమాసికాల వారీగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలన్నారు. నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గానికీ ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ (Vision Plan) అమలు చేస్తామన్నారు. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందన్నారు.
డేటా డ్రివెన్ పాలన
ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ (Real Time Governance) కాలం నడుస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. సిటిజెన్ డేటా అంతా క్రోడీకరించాం. అంగన్‌వాడీల స్థాయి నుంచే విద్యార్ధుల డేటా అనుసంధానం కావాలి. అవేర్ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. ఈ మేరకు డేటా లేక్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఒక్క చోటే క్రోడీకరించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. ఈ డేటా ద్వారా రియల్ టైమ్‌లోనే విశ్లేషించి... తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉందన్నారు.
ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి మారాలి
గతంలో ఒక్క చదువుకే కులం, స్థానికత, ఆదాయం ఇలా వేర్వేరు ధృవపత్రాలు 10 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకోవాల్సి వచ్చేదని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. ఈ పరిస్థితి అంతా మారిపోవాలని, కేంద్రం తీసుకొచ్చిన డిజి లాకర్‌ను (Digi Locker) సమర్ధంగా వినియోగించాలని యంత్రాంగానికి సూచించారు. అందరూ అన్ని శాఖలలోని సమాచారాన్ని తెలుసుకుని దానిని గుర్తించి పనిచేయాలన్నారు. ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందిస్తున్నప్పుడు మళ్లీ ప్రజల్ని కార్యాలయాలకు రప్పించటం ఎందుకన్నది ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.
ఆర్టీజీఎస్ తో అనుసంధానం
అన్ని జిల్లాల్లో ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రాలు ఏర్పాటు అవుతాయని, ఏఐ సాయంతో పాత సమాచారాన్ని, ప్రస్తుతం ఉత్పన్నం అయ్యే సమాచారాన్ని ఇంటిగ్రేట్ (Integration) చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రజలకు అందే ప్రతీ సేవలోనూ నాణ్యత ప్రమాణాల్ని నెలకొల్పాల్సి ఉందన్నారు. అలాగే ప్రజల నుంచి అందే ఫిర్యాదుల విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ఆర్దికేతర, చట్టపరమైన ఫిర్యాదుల విషయంలో ఆలస్యం జరగటం సరికాదన్నారు. టెక్నాలజీ వినియోగంతో ఖర్చులూ తగ్గించవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తప్పులు సరిదిద్దుకోవాల్సి ఉంది
ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాల వల్ల చాలా ప్రాణాలు పోయాయి. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక సంఘటన తర్వాత ఆయా తప్పులు దిద్దుకోవాల్సి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.. ఆ మేరకు ప్రామాణికాలు రూపొందించుకుని అటువంటి తప్పిదాలు మళ్లీ జరగ్గకుండా చూసుకోవాలన్నారు. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టం (Incident Management System) ద్వారా ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వీలైనంత వరకు ప్రమాదాల నివారణకు చిత్తశుద్ధితో పని చేయాలని స్పష్టం చేశారు.






