- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిఠాపురంలో ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకాధికారి : డిప్యూటీ సీఎం
పిఠాపురం నియోజకవర్గంలోని తీరప్రాంత పరిస్థితులను పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒకరి చొప్పున ప్రత్యేకాధికారులు (Special Officers) నియమించామని స్థానిక శాసనసభ్యుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : పిఠాపురం నియోజకవర్గంలోని తీరప్రాంత పరిస్థితులను పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒకరి చొప్పున ప్రత్యేకాధికారులు (Special Officers) నియమించామని స్థానిక శాసనసభ్యుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. స్థానిక అధికారులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉప్పాడ, మూలపేట, కోనపాపపేట తదితర తీర ప్రాంత గ్రామాల్లో సహాయక చర్యల పర్యవేక్షణకు గ్రామానికి ఒకరు చొప్పున ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. 34మంది సభ్యులతో ఒక ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందం పిఠాపురం నియోజకవర్గంలో అప్రమత్తంగా ఉందన్నారు. 34 బోట్లు సిద్ధం చేయడమే కాకుండా వారికి తోడుగా 12 మంది సభ్యుల క్విక్ రెస్పాన్స్ టీమ్ (Quick Response Team) సభ్యులు, 12 మంది గజ ఈతగాళ్ళు ఉన్నారని పేర్కొన్నారు. నిరంతర దిశానిర్దేశంతో పకడ్బందీగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగు నీరు, పాలు, మందులతోపాటు జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లాలో కూడా గంట గంటకు పరిస్థితిని డిప్యూటీ సీఎం సమీక్షిస్తున్నారు. అత్యవసర ఔషధాలను (Medicines) సమకూర్చి, వైద్య ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచామని డిప్యూటీ సీఎం తెలియజేశారు. ఎక్కడైనా విద్యుత్ స్తంబాలు నేల కూలితే తక్షణమే స్పందించేలా వ్యవస్థను సన్నద్ధం చేయడంతోపాటు 500 స్తంబాలను స్టాండ్ బైగా అధికారులు ఉంచారన్నారు. అలాగే పశువులకు ఇబ్బంది లేకుండా అవసరమైన పశుగ్రాశాన్ని (Fodder) కూడా గ్రామాల్లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. జల వనరుల శాఖ, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సమన్వయం చేసుకునేలా సూచనలు చేశామన్నారు.
పునరావాస శిబిరాల్లో 12 వేల మందికి మధ్యాహ్న భోజనం, 15 వేల మందికి రాత్రి భోజనం ఏర్పాటు చేశామన్నారు. 5 వేల పాల ప్యాకెట్లు, 1.50 లక్షల వాటర్ ప్యాకెట్లతోపాటు వాటర్ ట్యాంకర్లను కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. నియోజకవర్గం పరిధిలో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.






