- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ration Rice : మరోసారి కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం !
కాకినాడ పోర్టు(Kakinada Port)లో మరోసారి రేషన్ బియ్యం(Ration Rice) స్వాధీనం(Seized) కలకలం రేపింది. 92 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని..బియ్యాన్ని తరలిస్తున్న నాలుగు లారీలను సీజ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : కాకినాడ పోర్టు(Kakinada Port)లో మరోసారి రేషన్ బియ్యం(Ration Rice) స్వాధీనం(Seized) కలకలం రేపింది. 92 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని..బియ్యాన్ని తరలిస్తున్న నాలుగు లారీలను సీజ్ చేశారు. సీపీ రాజశేఖర్ బాబు రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. సీజ్ చేసిన బియ్యాన్ని గిడ్డంగికి తరలించామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం జూన్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు రోజులపాటు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. కాకినాడ యాంకరేజి పోర్టు, ఇతర ప్రాంగణాల్లోని 13 గోదాముల్లో తనిఖీలు నిర్వహించి 49,546 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 25,386 టన్నులు రేషన్ బియ్యంగా గుర్తించారు. జిల్లా కలెక్టర్ పోర్టులోకి వెళ్లి సోదాలు చేసిన సందర్భంలోనూ 640 టన్నుల రేషన్ బియ్యం నిల్వలు పట్టుబడ్డాయి. మరో 1064 టన్నులు పోర్టులోకి చేరాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లంగర్ వేసిన స్టెల్లా ఎల్ నౌకలో 1320టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన సీజ్ ది షిప్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతోంది. రేషన్‌బియ్యం ఎగుమతి మాఫియాకు కాకినాడ పోర్టు కేరాఫ్ గా మారిపోయింది. రేషన్ బియ్యం రోజుల వ్యవధిలోనే కాకినాడకు చేరి అక్కడి నుంచి ఆకర్షణీయమైన పేర్లు, ప్యాకింగ్‌లతో విదేశాలకు చేరుతోంది. దీని వెనుక పెద్ద మాఫియానే ఉంది. కాకినాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ రేషన్ బియ్యం మాఫియా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, ఇక్కడకు తరలించేలా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది.
కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని తమ మిల్లుల్లో రహస్యంగా పాలిష్ చేసి, ఆకర్షణీయమైన సంచుల్లో ప్యాక్ చేసి అక్కడ నుంచి పోర్టు ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఆఫ్రికా దేశాలకు తరలించేస్తున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంతో గడిచిన ఐదేళ్లలో ఏకంగా 50వేల కోట్ల విలువైనట్ల రేషన్ బియ్యం తరలించినట్లుగా ఆరోపణలున్నాయి.






