రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్‌ జారీ

by Malleboina Mahesh |

వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్‌ను జారీ చేసింది.

రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్‌ జారీ
X

దిశ, వెబ్ డెస్క్: ఈశాన్య రుతుపవనాలతో (Northeast monsoon) పాటు, అల్పపీడనం (low pressure) కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. అయితే రెండు రోజుల నుంచి వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న ఈ వర్షాల ప్రభావం మరింతగా పెరుగుతోంది. అల్పపీడనం కారణంగా ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్‌ను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు తీవ్రతరమవడంతో రాష్ట్రంలోని దక్షిణ, మధ్య, రాయలసీమ జిల్లాల్లో ఆకస్మిక వరదల (flash floods) ముప్పు నెలకొంది. తాజా అలర్ట్ ప్రకారం.. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాలతో పాటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.

ఈ జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదైతే ఫ్లాష్‌ఫ్లడ్‌లు సంభవించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం (APSDMA) ప్రకటన ప్రకారం, ఆకస్మిక వరదల ముప్పు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోయ ప్రాంతాలు, వాగు–వంకల పరిసర ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, వాహనదారులు నీరు నిలిచిన మార్గాల్లో ప్రయాణించవద్దని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, పోలీసు, ఫైర్‌ సిబ్బందికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

Next Story