- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు ఆస్తిలో సమానహక్కు ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు
ప్రతి ఇంటిలో ఒక మహిళా వ్యాపారవేత్త ఉండాలని, స్వయం బ్రాండ్ ఉత్పత్తుల్ని గ్లోబల్ బ్రాండ్ గా మార్చే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మహిళలకు ఆస్తిలో సమానహక్కును ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహిళలు చదువుల్లో రాణించాలని ప్రత్యేక విశ్వవిద్యాలయం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ దే అన్నారు. స్థానిక సంస్థల్లోనూ ఆయన మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్యోగాల్లో అయినా, వ్యాపారాల్లో అయినా అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ సంపాదిస్తున్నారన్నారు. ఆడపిల్ల పుడితే రూ.5 వేలు డిపాజిట్, హైస్కూల్ విద్యార్థినులకు సైకిళ్లు ఇచ్చి ఆడబిడ్డల్ని ప్రోత్సహించామన్నారు. గతంలో పెళ్లైన మహిళలు ఇల్లుదాటి బయటికి వస్తే నీకేం చేతనవుతుందని ఎగతాళి చేసేవారని, కానీ ఇప్పుడు డ్వాక్రా, మెప్మా వచ్చాక మహిళల ఆర్థిక పరిస్థితులు మారాయన్నారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య లక్షదాటిందని, ఈ ఏడాది ఆ సంఖ్యను 5 లక్షలకు తీసుకెళ్తామని సీఎం తెలిపారు. సొంతంగా ఉపాధిని కల్పించుకుని భర్త, అత్తమామల వద్ద గుర్తింపు, గౌరవం తెచ్చుకున్నారని తెలిపారు. మద్యానికి బానిసైన భర్తలను కూడా తమ ఆర్థిక ఎదుగుదలతో దారిలోకి తెచ్చుకున్నారని మహిళలను సీఎం అభినందించారు.
స్వయం బ్రాండ్ ఉత్పత్తుల్నే వాడాలి
స్త్రీశక్తి పథకంతో ఎక్కడికి వెళ్లాలన్న బస్సుల్లో ఉచితంగా వెళ్తున్నారని తెలిపారు. ఆడబిడ్డల పరిస్థితి చూసే ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నట్లు చెప్పారు. తెలుగు మహిళలు ఏ పని తలపెట్టినా సాధించేంతవరకూ వదలరన్నారు. రుణాలు ఇప్పించే బాధ్యత తనదే అయినా.. వాటిని సద్వినియోగం చేసుకోవలసింది మహిళలేనన్నారు. మహిళలు తయారు చేసిన వస్తువుల్ని స్వయం బ్రాండ్ నుంచి గ్లోబల్ బ్రాండ్ గా మార్చే బాధ్యత తనదని, నాణ్యత విషయంలో మాత్రం రాజీ పడొద్దని సూచించారు. తయారు చేసే ప్రతి వస్తువుకు మంచి ధర వచ్చేలా చూస్తామన్నారు. ప్రతీ ఇంట్లో స్వయం బ్రాండ్ ఉత్పత్తుల్నే వాడాలని సీఎం సూచించారు. డ్వాక్రా, మెప్మాలో కోటి 10 లక్షల మంది సభ్యులు ఉన్నారని, వారు తయారు చేసే ఉత్పత్తులు దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రోత్సహించారు. ప్రతీ ఇంటిలో ఒక మహిళా వ్యాపారవేత్త ఉండాలన్నారు.






