మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్ : ఏపీ మంత్రి నారా లోకేష్

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పేర్కొన్నారు.

మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్ : ఏపీ మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIBC) ప్రతినిధులతో మెల్ బోర్న్ లోని గ్రాండ్ హయత్ హోటల్ ది రెసిడెన్సీ హాల్ లో నిర్వహించిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారన్నారు. పెద్ద ప్రాజెక్టులను రాష్ట్రానికి ఎలా తీసుకురావాలో ఆయనకు బాగా తెలుసని తెలపారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందని స్పష్టం చేశారు.

ఏపీ స్టార్టప్ స్టేట్ అని, చేపట్టిన పనులు పూర్తిచేయాలనే ధృడ సంకల్పంతో (Strong Decision)ఉన్నామని తెలిపారు. ఒకసారి మాతో చేతులు కలిపిన తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్ అని భరోసానిచ్చారు. ఇచ్చిన హామీని అమలుచేయడం మాకు చాలా ముఖ్యమని అన్నారు. అందుకు ఉదాహరణగా ఏపీలోని విశాఖలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా సెంటరును (Google Data Center) ఉదాహరించారు. విధానాలను సులభతరం చేయడం, అనుమతుల మంజూరు, స్థలం కేటాయింపు వంటివి ప్రభుత్వం దగ్గరుండి చూస్తోందన్నారు. అందుకే ప్రాజెక్టులు విజయవంతం అవుతాయన్నారు. ఏపీకి గత 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం కేవలం ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. ఈ సవాళ్లను అవకాశాలుగా మలచుకోవాలని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి రాష్ట్ర, కేంద్ర స్థాయిలో చేయాల్సిన విధానపరమైన మార్పులు గుర్తించి, వాటిని అమలుచేసే పనిలో ఉన్నామని ఆస్ట్రేలియా ప్రతినిధులకు వివరించారు. ప్రస్తుతం 180 బిలియన్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నామని, దీనిని 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా తీసుకెళ్తామని చెప్పారు. కేవలం ఒకటి, రెండు రంగాలపైనే దృష్టిపెట్టకుండా 15 రంగాలపై (Sectors) దృష్టి కేంద్రీకరించామన్నారు. వాటిని క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేస్తామన్నారు. ఆటోమోటివ్, సిమెంట్, పునరుత్పాదక రంగం, ఎలక్టానిక్స్, కంప్రెస్డ్ బయోగ్యాస్, ఫార్మా, స్టీల్, ఆక్వా, క్వాంటం కంప్యూటింగ్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రకటించారు.

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. విదేశీ పెట్టుబడుల ద్వారా త్వరలోనే నెంబర్ వన్ (No 1) అవుతామని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఎంవోయూలను కుదుర్చుకోవడమే కాకుండా ప్రాజెక్టుల గ్రౌండింగ్ కోసం కృషిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలో నవంబర్ 14,15 తేదీల్లో జరగబోయే పార్ట్ నర్ షిప్ సమ్మిట్ కు హాజరై పెట్టుబడులకు (Investments) గల అవకాశాలను పరిశీలించాలని కోరారు.

Next Story