- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు కాకాణికి మరోసారి పోలీసుల నోటీసులు!!
ఏపీ రాజకీయాలు టీడీపీ వర్సెస్ వైసీపీగా (TDP vs YCP) మారాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాజకీయాలు టీడీపీ వర్సెస్ వైసీపీగా (TDP vs YCP) మారాయి. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారాలు వేడెక్కుతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) అనుసరించిన విధానాలనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అనుసరిస్తోంది. అయితే ఇరు పార్టీల ఘర్షణలో నవ్వుతూ చేసే పాపాలకు ఏడుస్తూ ఫలితాన్ని అనుభవించాలనే మాటను నిజం చేసేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి (Kakani Govardhan Reddy) సంబంధించి ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu), ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలపై (Somireddy Chandra Mohan Reddy) గతంలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు తాజాగా నోటీసులు అందజేశారు. నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల నేపథ్యంలో, విచారణకు హాజరుకావాలని పోలీసులు (Police) కాకాణిని కోరారు. అయితే కేవలం నోటీసులు ఇస్తే సరిపోదని, తనకు సంబంధించిన పూర్తి కేసు వివరాలు, ఎఫ్‌ఐఆర్ కాపీలు అందిస్తేనే తాను విచారణకు వస్తానని ఆయన స్పష్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కాకాణికి నేడు మరోసారి నోటీసులను ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారని సమాచారం.
ఈ క్రమంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని, ఎవరిని కూడా దూషించలేదని, కేవలం రాజకీయ పరమైన విమర్శలు మాత్రమే చేశానని ఆయన వాదిస్తున్నారు. పోలీసులు తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వగా వాటిని తీసుకున్న కాకాణి.. "ఏ అంశంపై నన్ను విచారించాలనుకుంటున్నారో స్పష్టత ఇవ్వండి. సోమిరెడ్డిపై నేను అనేక ఆరోపణలు చేశాను, వాటిలో దేనికి సంబంధించిన ఆధారాలు తేవాలి?" అని పోలీసులను ప్రశ్నించారు. కేసు వివరాలు ముందుగా ఇస్తేనే తాను సిద్ధమై వస్తానని నోటీసుపై కూడా రాసి ఇవ్వడం గమనార్హం.
మరోవైపు పోలీసు యంత్రాంగం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. విచారణకు సహకరించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇదివరకు మైనింగ్ కేసులు, ఇతర ఆరోపణలతో సతమతమవుతున్న కాకాణికి, ఈ కొత్త నోటీసులు మరింత ఇబ్బందికరంగా మారాయి. తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారని తెలియ వస్తోంది. నేడు మరోసారి పోలీసులు కాకాణికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలతో నెల్లూరు జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార కూటమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. కాకాణి పోలీసుల ముందు ఎప్పుడు హాజరవుతారు? లేదా ఆయన కోరినట్లుగా పోలీసులు కేసు వివరాలు ముందుగా అందిస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.






