ఆస్తుల సెటిల్మెంట్లు.. సీఐపై నాన్ బెయిలబుల్ కేసు

by Naga Rani Yarlagadda |

బెదిరింపులకు పాల్పడి, ఆస్తుల సెటిల్మెంట్లు చేసినట్లు కడప సీఐపై ఫిర్యాదు రావడంతో.. పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

ఆస్తుల సెటిల్మెంట్లు.. సీఐపై నాన్ బెయిలబుల్ కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలో ఐదేళ్లపాటు చక్రం తిప్పిన వివాదాస్పద సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) అశోక్‌రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అనంతపురం వాసి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు సి.కె.దిన్నె పోలీసులు సీఐ అశోక్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ప్రభాకర్ ఫిర్యాదులో వివరాలు

సి.కె.దిన్నె పోలీసులకు ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, 2023లో ప్రభాకర్, రాజాసింగ్‌ల మధ్య ఉన్న ఆస్తుల వివాదంలో సీఐ అశోక్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. అశోక్‌రెడ్డి తన అధికార దుర్వినియోగానికి పాల్పడి, ప్రభాకర్‌ను సి.కె.దిన్నె పోలీసు స్టేషన్‌లో రెండు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి, బెదిరించి ఆస్తుల సెటిల్మెంట్లు చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఐదేళ్లపాటు కడపలో చక్రం తిప్పిన సీఐ

YSRCP ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు కడప జిల్లాలో సీఐ అశోక్‌రెడ్డి ప్రముఖ పాత్ర పోషించినట్లు అభియోగాలు ఉన్నాయి. అధికారులపై ఒత్తిడి తెచ్చి తన పనులు చేయించుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అతనిపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే డిఐజి స్థాయి అధికారి విచారణ జరిపి, వారం రోజుల క్రితమే సస్పెండ్ చేశారు.

బీటెక్ రవి కిడ్నాప్ వ్యవహారంలోనూ విచారణ?

కేవలం ఆస్తుల సెటిల్మెంట్లు మాత్రమే కాకుండా, బీటెక్ రవి కిడ్నాప్ వ్యవహారంలోనూ సీఐ అశోక్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంలో కూడా ఆయనపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. సీఐ అశోక్‌రెడ్డిపై నమోదు చేసిన ఈ కేసు కడప జిల్లా పోలీసు వర్గాల్లో పెద్ద దుమారం రేపింది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన అశోక్‌రెడ్డిపై కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విచారణ వేగవంతంగా జరుగుతుందని పోలీసులు తెలిపారు.

Next Story