- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర ప్రజలే ప్రగతికి నిజమైన శిల్పులు : గవర్నర్ అబ్దుల్ నజీర్
రాష్ట్ర ప్రజలే.. ప్రగతికి నిజమైన శిల్పులు అని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం తొలివారి అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగ్గా.. ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలే.. ప్రగతికి నిజమైన శిల్పులు అని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం తొలివారి అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగ్గా.. ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. శకటాల ప్రదర్శన తర్వాత.. గవర్నర్ ప్రసంగిస్తూ.. తొలిసారి మన రాజధాని అమరావతిలో జాతీయజెండాను ఎగురవేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వారితో ఈ శుభ క్షణాన్ని పంచుకోవడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.
ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్ర అభివృద్ధి
రాష్ట్రానికి కొన్నేళ్లుగా స్పష్టమైన దిశ లేకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయిందని, రాజధాని నిర్మాణం ఆగిపోవడంతో ఆర్థిక విశ్వాసం దెబ్బతిందన్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ చర్య ప్రజల ఆకాంక్షలను తీర్చి వృద్ధిని పునరుద్ధరించేందుకేనని, ఆ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని గవర్నర్ తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణాలు ముందుకు సాగుతున్నాయని, సంస్థలు బలం పుంజుకుంటున్నాయని, రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన మొదలైందని, ప్రజల విశ్వాసం మళ్లీ స్థాపితమవుతోందన్నారు. స్వర్ణాంధ్ర -2047 కార్యాచరణను స్పష్టమైన దృష్టిలో కూటమి ప్రభుత్వం స్థిరపరిచిందని అభినందించారు. 2047 నాటికి ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తమ ముందున్న లక్ష్యమని గవర్నర్ తెలిపారు. కాలానుగుణంగా పాలన మారాలన్నది ప్రభుత్వ సిద్ధాంతమని చెప్పారు.
రాష్ట్ర పాలనలో టెక్నాలజీ కొత్తపుంతలు
రాష్ట్ర పాలనలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోందని, ప్రస్తుతం మనముందున్న టెక్నాలజీతో క్షణాల్లో పాలన చేరేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని, స్వర్ణాంధ్ర -2047 సంకల్పంతో సమాన అవకాశాల సమాజాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. వాట్సప్ లోనే 119 ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి గౌరవం, అవకాశాలు కల్పిస్తామని, అందరికీ న్యాయం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. కలసికట్టుగా ఆరోగ్య, ఆనంద, సౌభాగ్య ఆంధ్రప్రదేశ్ ను.. ప్రతీ గ్రామం సుభిక్షంగా, ప్రతి పట్టణం చైతన్యవంతంగా, ప్రతి నగరం సుస్థిరంగా ఎదిగే నిర్మిద్దామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మన రాష్ట్రం డ్రోన్ ఆంధ్రప్రదేశ్ గా ఎదుగుతోందని, ఓర్వకల్లులో 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ సిటీ నిర్మాణం జరుగుతోందని తెలిపారు.
సుపరిపాలనకు గవర్నర్ 10 సూత్రాలు
రాష్ట్రంలో సుపరిపాలనకు గవర్నర్ అబ్దుల్ నజీర్ 10 సూత్రాలను ప్రతిపాదించారు. పేదరికం లేని సమాజం, యువగళం లక్ష్యాలు, జనాభా నిర్వహణ - మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఇంధనం, అగ్రీటెక్, మౌలిక సదుపాయాలు, బ్రాండ్ ఏపీ, స్వచ్ఛాంధ్ర, స్మార్ట్ గవర్నెన్స్ లక్ష్యాలను వివరించారు. టెక్నాలజీ.. సేవలను వేగంగా, జీవనాన్ని మరింత సులభంగా మారుస్తోందన్నారు. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని, స్పేస్ సిటీ ఏర్పాటుతో ఏపీని ఆవిష్కరణల కేంద్రంగా నిలబెడుతున్నామని వివరించారు.
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పథకాలు
రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రూ.4వేలకు పెంచడం, ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్లు, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, మహిళల కోసం ఉచిత బస్సు పథకం, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని వివరించారు. ట్రైబల్ వెల్ఫేర్ కింద రూ.8 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని, ఇమామ్, మౌజీలు, పాస్టర్లకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నామని గవర్నర్ తెలిపారు.






