ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే జీవితాంతం రక్షణ: సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-28 07:49:32  IST  )

రాష్ట్రంలో ఉన్న ప్రతీ 14,15 ఏళ్ల బాలిక HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే జీవితాంతం రక్షణ: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్:ప్రతీ బాలికకు HPV వ్యాక్సిన్ వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్ తో కలిసి ప్రారంభించారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చిన బాలికలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. సీహెచ్ సీ చాలా శుభ్రంగా ఉంచారని సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) రాకుండా బాలికలు ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఒకసారి వ్యాక్సిన్ వేయించుకుంటే.. గర్భాశయ క్యాన్సర్ నుంచి జీవితాంతం రక్షణ లభిస్తుందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ చాలా సురక్షితం అని తెలిపారు. రాష్ట్రంలో అందరి ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకున్నామన్నారు. వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్యం ఆనందం, ఆదాయాన్ని కూడా ఇస్తుందన్నారు. ఆరోగ్యాన్ని పెంచుకోగలిగితే జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 19 వేల కోట్ల రూపాయలు ప్రజల ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నామని, ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా రూ.2.50 లక్షల వరకూ ఉచిత వైద్యం చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. మన ఆహారపు అలవాట్లతోనే క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని, దానిని అరికట్టేందుకే HPV వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు.

కాగా.. ప్రధాని నరేంద్రమోదీ రాజస్థాన్లో హెచ్ పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. తెలంగాణలో మంత్రి దామోదర రాజనర్సింహా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మూడేళ్లలో దేశంలో ఉన్న 14,15 ఏళ్ల వయసు బాలికలందరికీ ఈ వ్యాక్సిన్ ఉచితంగా వేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది 1.15 కోట్ల మంది బాలికలకు కేంద్ర ఆరోగ్యశాఖ HPV వ్యాక్సిన్లను ఇవ్వనుంది.

Next Story