- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా తాతను హత్య చేసింది టీడీపీ కాదా? : జగన్ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రాజధాని నిర్మాణాల పేరిట రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే రూ.1,200 కోట్లతో తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ.. పర్మినెంట్ పేరిట మళ్లీ కొత్తగా కడతామనడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు. ఈ కొత్త నిర్మాణాల కోసం పిలిచిన టెండర్లను పాత కాంట్రాక్టర్లకే కట్టబెట్టారని, కొత్తగా నిర్మిస్తున్న ఐదు బిల్డింగుల ఖర్చులను చూసి జనం నివ్వెరపోతున్నారని జగన్ పేర్కొన్నారు.
చదరపు అడుగుకు రూ.30 వేలా? కేసీఆర్ కూడా అవాక్కవుతారు
భవన డిజైన్ల కోసమే రూ. 401 కోట్లు తగలేశారని, ఈ ఐదు బిల్డింగుల మొత్తం అంచనా వ్యయం రూ.10,665 కోట్లుగా చూపిస్తున్నారని జగన్ మండిపడ్డారు. పాత లెక్కల ప్రకారం చదరపు అడుగుకు రూ.5 వేల లోపే ఉంటే, ఇప్పుడు కేవలం సివిల్ పనులకే రూ.20,427 చూపిస్తున్నారని.. ఫర్నీచర్, ఇంటీరియర్ కలిపితే ఇది చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందని జగన్ విశ్లేషించారు. ఫైవ్‌స్టార్ హంగులతో కట్టినా చదరపు అడుగుకు రూ.4,500 లోపే అవుతుందని, తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కేవలం రూ. 615 కోట్లతో అద్భుతమైన సచివాలయం నిర్మిస్తే.. ఏపీ సెక్రటేరియట్‌కు ఇంత భారీ ఖర్చు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అమరావతి కోసం ఇప్పటికే రూ. 47,387 కోట్ల అప్పు చేశారని, ఖజానా నుంచి మరో రూ. 9,200 కోట్లు ఖర్చు చేస్తూ ప్రజల వెన్ను విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మావిగన్ ప్రత్యామ్నాయాన్ని తట్టుకోలేకపోతున్నారు..
ఆచరణ సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు స్కామ్‌ల కోసమే ముందుకు వెళ్తున్నారని, అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించే తాము అన్ని వసతులు ఉన్న ‘మావిగన్’ (Mavigan) ను ప్రత్యామ్నాయ రాజధానిగా ప్రతిపాదించామని, దీనికి ప్రజల మద్దతు కూడా లభించిందని చెప్పారు. మావిగన్ పేరు చెబితేనే చంద్రబాబుకు గుండె ఆగిపోయేలా ఉందని, దాన్ని తట్టుకోలేకనే చంద్రబాబు, ఆయన మంత్రులు ఇష్టమొచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తప్పులను ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతోందని, కేసులతో ప్రతిపక్షాన్ని అణగదొక్కుతూ రాష్ట్రాన్ని 'జంగిల్ రాజ్'గా మార్చేశారని ధ్వజమెత్తారు. ఈ రెండేళ్ల బాబు పాలన ప్రోగ్రెస్ ఒక్కటే.. అది ‘‘చంద్రబాబు షూరిటీ - మోసం గ్యారంటీ’’ అంటూ జగన్ ఎద్దేవా చేశారు.
గొడ్డలి, గుణపాల రాజకీయం ఎవరిదో ప్రజలకు తెలుసు!
టీడీపీ నేతలు చేస్తున్న 'గొడ్డలి పోటు' విమర్శలపై జగన్ తీవ్రంగా ప్రతిస్పందించారు. "మా కుటుంబంలో ముగ్గురు హత్యా రాజకీయాలకు బలయ్యారు. మా తాత రాజారెడ్డిగారిని చంపిన హంతకులను టీడీపీ ఆఫీసులో దాచింది నిజం కాదా? వైఎస్సార్ మరణానికి ముందు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ.. 'నువ్వు మళ్లీ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా' అని బెదిరించలేదా? వివేకా బాబాయ్ హత్య జరిగింది కూడా టీడీపీ పాలనలోనే" అని గుర్తుచేశారు. నాడు వంగవీటి రంగాను హత్య చేయించింది ఎవరని, ఆయన హత్య వెనుక చంద్రబాబు ఉన్నారని హరిరామ జోగయ్యే స్వయంగా చెప్పారని, ఆ కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారని జగన్ విమర్శించారు. సొంత మామ ఎన్టీఆకే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబుకు, గొడ్డళ్లు, గుణపాలు దింపడం పుట్టినప్పటి నుంచి అలవాటని.. ఎవరిది గొడ్డలి పార్టీనో ప్రజలకు బాగా తెలుసంటూ జగన్ పదునైన వ్యాఖ్యలు చేశారు.






