తుని చిన్నారి మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. బొమ్మలతో వినూత్న ప్రయోగం!

by Ramesh Naini |

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

తుని చిన్నారి మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. బొమ్మలతో వినూత్న ప్రయోగం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చిన్నారి మాయమై మంగళవారానికి 11 రోజులు పూర్తయినా, ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో అధికారులు వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

కొత్త ప్రయోగం..

చిన్నారి చివరిగా కనిపించకుండా పోయిన తోట, కొండ ప్రాంతంలో అడవి జంతువుల సంచారం ఉందేమోనన్న అనుమానంతో, ఆ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తున్నారు. చిన్నారి ఆకారం పోలిన రెండు చిన్న బొమ్మలను ఇనుప కంచెకు అమర్చి, వాటిపై మాంసాహారాన్ని ఉంచారు. ఒకవేళ ఆ ప్రాంతంలో కొండచిలువలు లేదా ఇతర క్రూర మృగాలు ఉంటే, మాంసం వాసనకు ఆకర్షితులై బొమ్మలపై దాడి చేసే అవకాశం ఉందని, తద్వారా జంతువుల ఉనికిని గుర్తించవచ్చని పోలీసుల భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

కొనసాగుతున్న గాలింపు..

గత 11 రోజులుగా ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), హనుమాన్ టీమ్, అటవీ శాఖ, స్థానిక పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. గతంలో థర్మల్ డ్రోన్లు, నైట్ ట్రాప్ కెమెరాలతో జల్లెడ పట్టినప్పటికీ, ఎటువంటి జంతువుల కదలికలు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే బొమ్మల ప్రయోగాన్ని చేపట్టారు. మరోవైపు, ఈ కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క పోస్టుమార్టం నివేదిక వచ్చేందుకు మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కిడ్నాప్‌కు ఆధారాల్లేవు: ఎస్పీ

కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు చిన్నారి కిడ్నాప్‌నకు గురైందనేందుకు ఎటువంటి బలమైన ఆధారాలూ లభించలేదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులను పరామర్శించిన ఆయన, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. చిన్నారి ఆచూకీ కోసం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు.

Next Story