డ్రైవర్ రాయుడు హత్య కేసులో కొత్త ట్విస్ట్

by Thanuru Gopichand |

అసలు ఆ వివరాలు ముందే ఎలా తెలుసని ప్రశ్నించిన కోట చంద్రబాబు.

డ్రైవర్ రాయుడు హత్య కేసులో కొత్త ట్విస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య (Driver Raidu Murder) కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి జనసేన (Janasena Srikalahasthi) పార్టీ మాజీ ఇంచార్జి వినుత కోట భర్త చంద్రబాబు (Kota Chandra Babu) విడుదల చేసిన తాజా వీడియో డ్రైవర్ రాయుడు హత్య కేసులో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోలో ఆయన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై (MLA Bojjala Sudheer Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చెన్నై పోలీసులు రిమాండ్ రిపోర్టును అధికారికంగా బయటపెట్టక ముందే ఎమ్మెల్యేకు ఆ వివరాలు ఎలా తెలిశాయని ఆయన ప్రశ్నించారు. తమను అరెస్టు చేసే ముందు శ్రీకాళహస్తి సీఐ గోపి తమిళనాడు పోలీసులను ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్‌లో పేర్లు చేర్చకముందే అసలు అది హత్యో లేదా ఆత్మహత్యో తేలకముందే తమపై నిందారోపణలు చేయడం వెనుక ఎమ్మెల్యే రాజకీయ కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపించారు.

​ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థుల ఎదుగుదలను సహించలేక పోతున్నారని విమర్శలు గుప్పించారు. చెన్నై కేంద్రంగా ఉన్న తన వ్యాపార పలుకుబడిని ఉపయోగించి తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. హత్య జరిగినట్లు చెబుతున్న సమయంలో తాము చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో సొంత మామగారి చికిత్స నిమిత్తం ఉన్నామని స్పష్టం చేశారు. అందుకు సంబంధించి ఆసుపత్రి పార్కింగ్ ఏరియాలోని సీసీ కెమెరా దృశ్యాలే నిదర్శనమని పేర్కొన్నారు. తాము రిమాండ్‌కు వెళ్లకముందే ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడటం, డ్రైవర్ రాయుడు తన తమ్ముడు వంటివాడని చెప్పడం అంతా ముందస్తు ప్రణాళికలో భాగమేనని ఆయన విమర్శించారు.

​ఈ కేసులో అసలు నిజాలు బయటకు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక విచారణ బృందం (SIT) లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోట చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ కుట్రలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉందని ప్రజలందరికీ తెలుసని, అయినప్పటికీ అధికారులు ఎందుకు విచారణ చేపట్టడం లేదని ఆయన నిలదీశారు. రాజకీయ ప్రాబల్యంతో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఉన్నత స్థాయి విచారణ ద్వారానే తమకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Next Story