రేపటినుంచే రొట్టెల పంపిణీ.. స్వర్ణాల చెరువు వద్ద భారీ ఏర్పాట్లు

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. రేపటి (శుక్రవారం) నుంచి ఈ చారిత్రాత్మక వార్షిక మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది.

రేపటినుంచే రొట్టెల పంపిణీ.. స్వర్ణాల చెరువు వద్ద భారీ ఏర్పాట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. రేపటి (శుక్రవారం) నుంచి ఈ చారిత్రాత్మక వార్షిక మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. కులమతాలకు అతీతంగా సాగే ఈ సౌభ్రాతృత్వ వేడుకల కోసం ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు నెల్లూరు నగరానికి తరలివస్తున్నారు. భక్తులు తమ కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ, నెరవేరిన వారు కృతజ్ఞతగా రొట్టెలను మార్చుకునే ఈ అద్భుత ఘట్టం కోసం స్వర్ణాల చెరువు (నెల్లూరు ట్యాంక్) ముస్తాబైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారాషహీద్ దర్గా ప్రాంగణంలో, స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద జిల్లా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేసింది. తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, ప్రత్యేక వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచారు.

15 నుంచి 20 లక్షల మంది వస్తారని అంచనా..

గత ఏడాది కంటే ఈసారి భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఐదు రోజుల పండుగ కాలంలో సుమారు 15 నుంచి 20 లక్షల మంది భక్తులు దర్గాను దర్శించుకుని, రొట్టెలను మార్చుకుంటారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గేట్టుగానే ఘాట్ల సంఖ్యను పెంచి, క్యూలైన్లను క్రమబద్ధీకరించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల భద్రత దృష్ట్యా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. దర్గా పరిసర ప్రాంతాలు, పార్కింగ్ జోన్లు, రొట్టెలు మార్చుకునే ఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా" వందలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా యావత్ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ గట్టి నిఘా ఉంచారు. భక్తులకు సేవలందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను కూడా అందుబాటులోకి తెచ్చారు.

Next Story