ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నేషనల్ హైవే 16.. 170 మంది మృతి

by Naga Rani Yarlagadda |

ఆ నేషనల్ హైవేపై వెళ్లే వాహనదారులకు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ప్రమాదం ఎప్పుడు, ఏ వైపు నుంచి వస్తుందో తెలియక బిక్కు బిక్కుమంటూనే రాకపోకలు సాగిస్తున్నారు.

ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నేషనల్ హైవే 16.. 170 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆ నేషనల్ హైవేపై వెళ్లే వాహనదారులకు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ప్రమాదం ఎప్పుడు, ఏ వైపు నుంచి వస్తుందో తెలియక బిక్కు బిక్కుమంటూనే రాకపోకలు సాగిస్తున్నారు. అదే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను కలిపే నేషనల్ హైవే 16 (National Highway 16) పై రెండున్నరేళ్లలో అనేక ప్రమాదాలు జరగ్గా.. 170 మందికి పైగా మరణించగా.. వందలాది మంది వాహనదారులు తీవ్రగాయాల పాలయ్యారు. కుటుంబ పెద్దల్ని కోల్పోయి అనాధలైన పిల్లలూ ఉన్నారు.

ఏలూరు జిల్లా గుండుగొలను నుంచి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వరకూ సుమారు 70 కిలోమీటర్ల మేర 2021లో రూ.1800 కోట్ల వ్యయంతో నేషనల్ హైవే 16ను నిర్మించారు. ఈ హైవేపై ప్రతిరోజూ వేలాది వాహనాలు వెళ్తున్నా.. ప్రతిరోజూ ఏదొక ప్రమాదం జరుగుతూనే ఉంటోంది. ఇందుకు రహదారి నిర్మాణంలో లోపాలే కారణమని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో 53 కిలోమీటర్ల మేర హైవే విస్తరించి ఉంది. 2023 జనవరి నుంచి 2025 జూన్ వరకూ.. 250 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 172 మంది మరణించినట్లు నివేదికలు చెప్తున్నాయి. మరో 230 మంది గాయాలపాలైనట్లు రికార్డులు చెప్తున్నాయి.

కొవ్వూరు మండలం కాపవరం, గౌరీపట్నం మధ్యలో హైవేకి ఇరువైపులా దాబాలు, మెకానిక్ షెడ్లు, ఇతర దుకాణాలు విచ్చలవిడిగా పెట్టడంతో.. లారీలను హైవేపైనే నిలిపి ఉంచుతున్నారు. రాత్రివేళల్లో 500 మీటర్ల మేర వాహనాలు ఇలా నిలిపి ఉంచడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. బంధపురం వద్ద సర్వీస్ రోడ్డు సరిగ్గా లేకపోవడంతో దానిని మూసివేసేందుకు చర్యలు చేపట్టకపోవడం, లైట్లు సరిగ్గా లేకపోవడం, పార్కింగ్ సౌకర్యం ఉన్నా పట్టించుకోకపోవడంతో వాహనాలను రోడ్లపైనే నిలిపి ఉంచుతున్నారు. తాజాగా ఈ హైవేపై 13 బ్లాగ్ స్పాట్లను గుర్తించిన అధికారులు నేషనల్ హైవేస్ అథారిటీకి వాటి గురించి రిపోర్ట్ చేసినట్లు తెలిపారు. ఇకనైనా హైవేపై ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే 16 చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Next Story