అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు

by Ramesh Naini |

లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, వివేకవంతమైన నిర్ణయాలతో యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, వివేకవంతమైన నిర్ణయాలతో యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు మంగళవారం స్థానిక పీఈఎస్ వైద్య కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి క్విజ్ పోటీల్లో పాల్గొని, వారి క్రీడలను వీక్షించారు.

విద్యా రంగానికి చేయూత..

ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ విద్యను అందిస్తున్నాయని, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో 1.06 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని వివరించారు. ఈ సందర్భంగా తన మనవడు దేవాన్ష్ టీవీ, మొబైళ్లకు దూరంగా ఉంటూ పుస్తకాలు చదువుతాడని గుర్తుచేశారు. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, వ్యసనాలు జీవితాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు.

ఆత్మహత్యలు పరిష్కారం కావు..

పరీక్షల్లో విఫలమవడం జీవితానికి ముగింపు కాదని, ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకు శోకం మిగల్చవద్దని హితవు పలికారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని.. మహాత్మా గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీల నుంచి స్ఫూర్తి పొంది సమాజానికి సేవ చేయాలని సూచించారు. లక్ష్యంతో ముందుకు సాగితే ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజినీర్ వంటి ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని భువనేశ్వరి స్పష్టం చేశారు.

Next Story