నంద్యాల : నేడు విజయ డెయిరీ డైరెక్టర్ల ఎన్నికలు

by Thanuru Gopichand |

వేడెక్కిన రాజకీయ వాతావరణం. ప్రధాన పోటీ మద్ధతుదారుల హడావుడి.

నంద్యాల : నేడు విజయ డెయిరీ డైరెక్టర్ల ఎన్నికలు
X

దిశ, వెబ్ డెస్క్ : నంద్యాల (Nandyal) జిల్లాలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. జిల్లాలోని ప్రముఖ పాడి రైతుల సహకార సంస్థ అయిన విజయ డెయిరీ (Vijaya Dairy) డైరెక్టర్ల ఎన్నిక నేడు జరగనుంది. దీంతో అటు రాజకీయ వర్గంతో పాటు ఇటు పాడి రైతుల్లోనూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.46

పట్టు నిలుపుకునేందుకు

మూడు డైరెక్టర్ల పదవులకు నేడు ఎన్నికలు (Elections) జరగనుండడంతో నంద్యాల విజయ డెయిరీలో ఎన్నికల సందడి నెలకొంది. డెయిరీకి సంబంధించిన పాలకవర్గంలో ఈ స్థానాలు కీలకమైనవి కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల మద్ధతుదారులు తమ పట్టు నిలుపుకునేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఈ ఎన్నికలతో గత కొంత కాలంగా డెయిరీ యాజమాన్యం, స్థానిక నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య ఒక కొలిక్కి రానుంది.

46 సొసైటీలకు అర్హత

ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు మొత్తం 46 పాల సొసైటీలకు అధికారులు అర్హత కల్పించారు. మొత్తం మూడు డైరెక్టర్ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రస్తుత చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి వర్గానికి, కూటమి ప్రభుత్వ మద్ధతుదారులకు మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే 39 పాల సొసైటీల అధ్యక్షులపై వేటు పడడం, నామినేషన్ల ప్రక్రియలో వివాదాలు చోటు చేసుకోవడంతో కొంత మేర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.

వివాదాల నడుమ ఎన్నికలు

విజయ డెయిరీ ఎన్నికల నిర్వహణపై గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, అర్హత ఉన్న సొసైటీలను పక్కన పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా భూమా అఖిలప్రియ, డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి వర్గాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గతంలో జరిగిన సర్వసభ్య సమావేశాలకు హాజరుకాలేదన్న సాకుతో పలువురు సొసైటీ అధ్యక్షులపై అనర్హత వేటు వేయడం ఈ వివాదానికి ప్రధాన కారణం కాగా.. దీనిపై కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

భారీగా పోలీసు బందబోస్తు

ఈ మూడు డైరెక్టర్ పదవులను దక్కించుకునే వారు భవిష్యత్తులో డెయిరీ చైర్మన్ పీఠాన్ని శాసించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నంద్యాల విజయ డెయిరీ ప్రాంగణం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితాలు ఎలా ఉంటాయోనని జిల్లా వ్యాప్తంగా పాడి రైతులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Next Story