'చివరి వరకు నా పోరాటం ఆగదు' సీబీఐ విచారణపై సునీత అసంతృప్తి

by Ramesh Naini |

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు పులివెందులలో నివాళులు అర్పించారు.

చివరి వరకు నా పోరాటం ఆగదు సీబీఐ విచారణపై సునీత అసంతృప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు పులివెందులలో నివాళులు అర్పించారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునీత వివేకా హత్య కేసు విచారణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హత్య కేసును విచారిస్తున్న సీబీఐ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని సునీత ఆరోపించారు. కీలక నిందితుల విషయంలో అధికారులు కేవలం వారు చెప్పిన స్టేట్‌మెంట్లను నమోదు చేయడానికే పరిమితమయ్యారని, లోతుగా విచారణ జరపలేదని ధ్వజమెత్తారు.

కీలక సాక్ష్యాలను పట్టించుకోలేదు..

హత్య జరిగిన సమయంలో నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, సందేశాలను సీబీఐ సీరియస్‌గా తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా సాక్షి మీడియాలో వివేకా మరణం 'గుండెపోటు' అని వార్త రావడానికి ఒక నిమిషం ముందే, నిందితుడు కిరణ్ యాదవ్.. అర్జున్ రెడ్డికి మెసేజ్ పంపారని ఆమె గుర్తు చేశారు. హత్యకు ముందు, తర్వాత నిందితుల మధ్య భారీగా ఫోన్ కాల్స్ జరిగినప్పటికీ వాటిని విశ్లేషించడంలో సీబీఐ విఫలమైందని విమర్శించారు. తాను స్వయంగా కోర్టుకు, సీబీఐకి అదనపు ఆధారాలు సమర్పించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్, భారతిలను విచారించాలి

ఈ కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిలను విచారించాల్సిన అవసరం ఉందని సునీత స్పష్టం చేశారు. వారిని విచారించకుండా కేసు ఒక కొలిక్కి రాదని ఆమె అభిప్రాయపడ్డారు. ‘నా తండ్రి హత్య కేసులో అందరూ మాకు అన్యాయం చేస్తున్నారు. నేను ఈ స్థాయిలో ఒంటరి పోరాటం చేస్తున్నా ఇంకా న్యాయం జరగలేదు. కానీ నా పోరాటం ఇక్కడితో ఆగదు, న్యాయం జరిగే వరకు కొనసాగిస్తా’ అని సునీత రెడ్డి తేల్చి చెప్పారు.

Next Story