- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇతర ఇళ్లలో పిల్లలు.. టీడీపీ ఇళ్లలో యోధులు పుడతారు: ఎంపీ బైరెడ్డి శబరి హాట్ కామెంట్స్
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కేవలం ఒక సామాన్య సభ కాదు, అది పసుపు సైన్యం గర్జన అని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అభివర్ణించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కేవలం ఒక సామాన్య సభ కాదు, అది పసుపు సైన్యం గర్జన అని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అభివర్ణించారు. మహానాడు వేదికగా శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ఆమె, పార్టీ కార్యకర్తలపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘ప్రతి ఇంట్లో పిల్లలు పుడతారు.. కానీ తెలుగుదేశం కార్యకర్తల ఇంట్లో మాత్రం యోధులు పుడతారు’ అంటూ బైరెడ్డి శబరి చేసిన వ్యాఖ్యలు సభలో ఉత్తేజాన్ని నింపాయి. తామంతా కేవలం పార్టీ కోసం, తమ అధినేత కోసం, పార్టీ ఆశయ నినాదం కోసమే అంకితభావంతో పనిచేస్తున్నామని ఈ సందర్భంగా ఆమె హాట్ కామెంట్స్ చేశారు.
భవిష్యత్తును నిర్ణయించే మహా సంకల్ప సభ
ఈ మహానాడు రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఒక మహా సంకల్ప సభ అని బైరెడ్డి శబరి పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సంక్షేమాన్ని చేరవేస్తూ, సువర్ణ పాలన అందించడమే తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు. ‘అభివృద్ధి - సంక్షేమం’ అనేది టీడీపీ నినాదమైతే.. ‘హత్యలు, అవినీతి, దోపిడీ’ అనేవి వైసీపీ నినాదాలని ఆమె విమర్శించారు.
వైసీపీ విధ్వంస పాలనపై ధ్వజం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను ఆమె తీవ్రస్థాయిలో ఎండగట్టారు. వైసీపీ విధ్వంసకర పాలన వల్ల సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా తప్పుడు కేసులు బనాయించి, తీవ్రంగా హింసించారని ఎంపీ బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు.






