- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైయస్ జగన్ ఆరోపణలపై ఎంపీ భరత్ ధీటైన కౌంటర్
గీతం భూముల విషయంపై వైసీపీ వివాదం రేకెత్తిస్తోంది. తన పట్ల వివక్ష ఎందుకని ప్రశ్నించిన ఎంపీ.

దిశ, వెబ్ డెస్క్ : గీతం యూనివర్సిటీ (Geetam University) భూములపై వైసీపీ (YCP) పార్టీ వివాదం సృష్టించడాన్ని విశాఖపట్నం ఎంపీ, గీతం యూనివర్సిటీ అధ్యక్షుడు భరత్ (Mathukumilli Bharat) తప్పుబట్టారు. గీతం యూనివర్సిటీకి కేటాయించాలనుకుంటున్న 54.79 ఎకరాల భూమి విలువ రూ.5వేల కోట్లు అని వైసీపీ చేస్తున్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని భరత్ స్పష్టం చేశారు. రుషికొండ సమీపంలోని రాజీవ్ స్వగృహ భూములను గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎకరాకు సుమారు రూ. 19.5 కోట్ల చొప్పున విక్రయించారని ఆయన గుర్తు చేశారు. ఆ లెక్కన చూసినా ఈ 54 ఎకరాల విలువ రూ. 1,000 కోట్లు దాటదని వివరించారు. ఒకవేళ జగన్ చెప్పినట్లు భూమి విలువ రూ. 5వేల కోట్లకు పెరిగితే అది కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు.
వైసీపీ ద్వంద్వ వైఖరి
గత ప్రభుత్వ హయాంలో గీతం క్యాంపస్‌కు కిలోమీటరు దూరంలో ఉన్న ఒక అంతర్జాతీయ పాఠశాలకు (TISB) ఎకరా కేవలం కోటి రూపాయలకే 11 ఎకరాలు ఎందుకు ఇచ్చారని వైయస్ జగన్ ను భరత్ ప్రశ్నించారు. జగన్ లెక్కల ప్రకారం రూ.1,100 కోట్ల విలువైన ఆ భూమిని కేవలం రూ.11 కోట్లకే కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు. విద్యాసంస్థల పట్ల వైసీపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు.
ధర చెల్లించడానికి సిద్ధం
ప్రభుత్వం కేటాయించే భూమికి నిర్ణీత ధర చెల్లించడానికి గీతం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని భరత్ స్పష్టం చేశారు. తాము దేనినీ ఉచితంగా కోరడం లేదని భరత్ కుండ బద్ధలుగొట్టారు. 2020లో దసరా సెలవుల్లో అర్ధరాత్రి వేళ ప్రహరీ గోడను అక్రమంగా కూల్చివేసినప్పుడే యూనివర్సిటీ పట్ల గత వైసీపీ ప్రభుత్వానికి ఉన్న కక్ష వెల్లడైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే గీతంపై విషం చిమ్ముతున్నారని ఎంపీ భరత్ మండిపడ్డారు.
సేవా దృక్పథాన్ని మరువద్దు
కోవిడ్ కష్టకాలంలో ప్రభుత్వం గీతం ఆసుపత్రిని (GIMSR) జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా గుర్తించి వేలమందికి చికిత్స అందించిందన విషయాన్ని వైయస్ జగన్ కు గుర్తు చేశారు. అప్పుడు గీతం అందించిన సేవలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గీతం కేవలం ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కాదని, సమాజానికి సేవ చేస్తున్న విద్యాసంస్థ అని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిష్టాత్మక విద్యాసంస్థలపై తప్పుడు ఆరోపణలు చేయవద్దని ఆయన జగన్ కు హితవు పలికారు.






