- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాతృ భాషను కాపాడుకోవాలి.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘X’ (ట్విట్టర్) వేదికగా.. అందరికీ ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. భాషను కాపాడుకోవడం ద్వారా సాంస్కృతి వైవిధ్యాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయని తెలిపారు. మన కళలు, ఆచారాలు, పండుగలు, సంప్రదాయ విజ్ఞానం, వృత్తుల వారసత్వం లాంటి వాటిని సంరక్షించుకోవడం మాతృభాషను కాపాడుకోవడం ద్వారానే వీలవుతుందని పేర్కొన్నారు.
మాతృభాష పట్ల ప్రేమను పెంచుకోవడం అంటే, ఇతర భాషలను నేర్చుకోవద్దని కాదని అన్నారు. కోరినన్ని భాషలు నేర్చుకోవాలని.. కానీ మాతృభాషను రక్తంలో నింపుకోవాలని పిలుపునిచ్చారు. ఎవరైతే మాతృభాషను సరిగా నేర్చుకుంటారో వారు, ఇతర భాషలను కూడా అదే స్థాయిలో నేర్చుకుని నిష్ణాతులు కాగలరని పరిశోధనలు చెబుతున్నాయని తెలిపారు. అందుకే బయట ఎన్ని భాషలు నేర్చుకున్నా ఇంట్లో మాత్రం మన మాతృభాష తెలుగు మాట్లాడేందుకు ప్రాధాన్యతనిద్దామని అన్నారు. ప్రభుత్వాలు సైతం తమ బాధ్యతగా పరిపాలనను అధికారికంగా తెలుగులో జరపాలన్నారు. ఉత్తర్వులను ఏవైనా విధిగా తెలుగులోనే ఇవ్వాలని సూచించారు. భావాలు, అభిప్రాయాలకు అతీతంగా మన మాతృభాషను కాపాడుకునేందుకు ప్రతి తెలుగు వాడు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో... తెలుగు వారమందరం తెలుగులోనే మాట్లాడుదాం.. అంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.






