అప్పుల లెక్కల్లో భారీ తేడాలు.. గవర్నర్‌కు బొత్స ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |

అప్పుల గణాంకాల విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ అసత్యాలను వెల్లడించిందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు....

అప్పుల లెక్కల్లో భారీ తేడాలు.. గవర్నర్‌కు బొత్స ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: అప్పుల గణాంకాల విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ అసత్యాలను వెల్లడించిందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Ycp Mlc Bosta Satyanarayana) ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌(Governor Abdul Nazeer )కు లేఖ రాశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం తన అప్పులను రూ. 60,485 కోట్లుగా చూపినప్పటికీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికల ప్రకారం ఆ మొత్తం రూ. 81,082 కోట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. కేవలం ఒక ఏడాదిలోనే సుమారు రూ. 20,500 కోట్లకు పైగా వ్యత్యాసం ఉండటం రాష్ట్ర ఆర్థిక నిర్వహణలోని లోపాలను సూచిస్తోందని బొత్స తెలిపారు.

కావాలనే మినహాయింపు

ప్రభుత్వం కావాలనే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్, జీఎస్టీ సర్దుబాట్లను ఈ లెక్కల నుంచి మినహాయించిందని బొత్స విమర్శించారు. నివేదించని ఆఫ్-బడ్జెట్ అప్పులు, వాటి నిర్వచనాలను ఇష్టానుసారంగా మార్చడం ద్వారా అసలు వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ విధమైన గణాంకాల తారుమారు వల్ల ప్రజలకు, రాజ్యాంగ సంస్థలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని బొత్స ఆందోళన వ్యక్తం చేశారు.

తక్షణమే వెనక్కి తీసుకోవాలి

శాసనసభకు సమర్పించిన తప్పుడు సమాచారాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, కాగ్ రికార్డులకు అనుగుణంగా గణాంకాలను సవరించాలని బొత్స డిమాండ్ చేశారు. సభను, ప్రజలను తప్పుదోవ పట్టించిన సంబంధిత అధికారులపై, విభాగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్‌ను కోరారు. పారదర్శకత లేని ఆర్థిక నివేదికలు రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని, ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకొని వాస్తవాలను వెలికితీయాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కోరారు.

Next Story