హరీశ్ రావు వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి కౌంటర్

by Thanuru Gopichand |

నీటి పారుదల ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల వాగ్వాదం.

హరీశ్ రావు వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్ : బిఆర్ఎస్ కీలక నేత.. తెలంగాణ మాజీ నీటీ పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు హరీశ్ రావుకు కౌంటర్ ఇస్తూ.. ఆయన చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఏపీ వాళ్లు నీరు దోచుకుంటున్నారని ఆయన చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. నదీ జలాలను ఆంధ్రావాళ్లు దోచుకుంటున్నారని బిఆర్ఎస్ పదే పదే బుకాయించిందన్నారు. బిఆర్ఎస్ ఆరోపణలకు ప్రజల నుంచి ఎన్నికల్లో తగిన సమాధానం లభించిందన్నారు. అబద్ధపు ఆరోపణలతో బురదజల్లితే ఓట్లు రావని ఓటమిని అందించి సమాధానం చెప్పారన్నారు. ఏడాదికి రెండు, మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని రాయలసీమ వంటి ప్రాంతాలకు నీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. అంతేగానీ నీటిని దోచుకోవడం వంటివి పనులు చేయడం లేదన్నారు.

ఏపీలో వైసీపీ, తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ నాటి వైసీపీ మంత్రి రోజా ఇంటికి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు సముద్రంలోకి వెళ్లే నీటిని వినియోగించుకోవాలని సూచించిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఆ మాటతోనే మాజీ సీఎం వైయస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారన్నారు. అయితే సరైన అనుమతులు లేని కారణంగా కేంద్రప్రభుత్వం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ పనులను ప్రాజెక్టు పనులు నిలిపివేశాయని స్పష్టం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నేతలు భిన్నమైన వ్యాఖ్యలు చేయడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

కేసీఆర్ అయినా.. రేవంత్ రెడ్డి అయినా టీడీపీ నుంచి బయటకు వెళ్లి ముఖ్యమంత్రులు అయిన వారేనని పేర్కొన్నారు. కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ మంత్రులు కూర్చొని నీటి పంపకాల విషయమై మాట్లాడుకోవాలని అభిప్రాయపడ్డారు. తద్వారా సమస్యను పరిష్కరించుకొని ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Next Story