ఆ ఆస్తి చట్టబద్ధం.. నిజాయితీపై బురదజల్లితే ఊరుకోం: ఎమ్మెల్యే మాధవి

by Vemula.Srinu Prasad |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విపక్షాలు చేస్తున్న నిరాధార ఆరోపణలను, అసత్య ప్రచారాలను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తీవ్రంగా ఖండించారు. ..

ఆ ఆస్తి చట్టబద్ధం.. నిజాయితీపై బురదజల్లితే ఊరుకోం: ఎమ్మెల్యే  మాధవి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(AP Deputy CM Pawan Kalyan)పై విపక్షాలు చేస్తున్న నిరాధార ఆరోపణలను, అసత్య ప్రచారాలను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి(Nellimarla MLA Lokam Naga Madhavi) తీవ్రంగా ఖండించారు. తెలంగాణలోని శంకర్‌పల్లి ప్రాంతం(Telangana Shankarapalli Region)లో పవన్ కల్యాణ్‌కి ఉన్న వ్యవసాయ భూమి పూర్తిగా చట్టబద్ధమైనదని, దానికి సంబంధించిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు, అనుమతులు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. 2015 నుంచి ఆ ఆస్తికి క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నారని తెలుపుతూ... జన్వాడ గ్రామంలోని మరో వివాదాస్పద ఆస్తికి సంబంధించిన అంశాలను దీనికి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో కావాలనే కుట్రపూరితంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

ప్రజాదరణను చూసి ఓర్వలేకే...

ప్రజల కోసం, ప్రజా సేవ కోసం తన సినీ జీవితాన్ని త్యాగం చేసి రెండు దశాబ్దాలుగా పోరాడుతున్న పవన్ కల్యాణ్ నిజాయితీపై బురదజల్లే ప్రయత్నాలు గతంలోనూ విఫలమయ్యాయని, ఇప్పుడు కూడా సాగవని ఆమె గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపై ఆయన నిరంతరం జరుపుతున్న పోరాటాన్ని తట్టుకోలేక, అలాగే తెలంగాణలో జనసేన పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే రాజకీయ ప్రత్యర్థులు ఈ విధమైన దుష్ప్రచారాలకు తెగబడుతున్నారని విమర్శించారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సమసమాజ స్థాపనే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ కార్మికులు, రైతులు, గిరిజనుల హక్కుల కోసం నిలబడ్డారని పేర్కొన్నారు.

ఖచ్చితంగా తిరస్కరిస్తాం

ఇలాంటి చట్టవిరుద్ధమైన, అవాస్తవ ప్రచారాలను చట్టబద్ధమైన ఆధారాలు, వాస్తవాలతో తిప్పికొట్టేందుకు జనసేన పార్టీ పూర్తి సిద్ధంగా ఉందని లోకం మాధవి స్పష్టం చేశారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వాస్తవాలను గుర్తిస్తారని, ఈ తప్పుడు రాజకీయాలను ఖచ్చితంగా తిరస్కరిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Next Story