దుర్గమ్మ గుడిలో అపచారం.. బాధ్యులకు మెమోలు జారీ

by Thanuru Gopichand |

ఆలయ పవిత్రతను కాపాడేందుకు దేవాదాయ శాఖ ప్రాధాన్యం.

దుర్గమ్మ గుడిలో అపచారం.. బాధ్యులకు మెమోలు జారీ
X

దిశ, వెబ్ డెస్క్ : బెజవాడ కనకదుర్గమ్మ (Bejwada Kanaka Durgamma) దేవాలయంలో ఇటీవల అపచారం జరిగిన విషయం విదితమే. దానిపై విచారణ జరిపించేందుకు దేవస్థానం ఈఓ (Temple EO) ప్రత్యేక కమిటీని వేశారు. స్థానాచార్యుడి ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన కమిటీ తుది నివేదికను ఈఓ శీనా నాయక్ కు అందజేసింది. నివేదికను పరిశీలించిన ఈఓ బాధ్యులపై చర్యలు తీసుకుంటూ ఆదేశాలను జారీ చేశారు. అభిషేకానికి వినియోగించిన పాలల్లో పురుగులు రావడానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని వారికి మెమోలు జారీ చేశారు.

అభిషేకానికి వినియోగించిన పాత్ర పరిశుభ్రంగా లేకపోవడం.. అందులోనే పాలను పోసి అర్చకుడు అభిషేకం చేయడం అపచారం జరగడానికి కారణంగా కమిటీ తేల్చింది. స్టోర్, పూజల విభాగాల్లోని సిబ్బంది కూడా కమిటీ విచారణలో బయటపడింది. దీంతో శ్రీక్ర నవావరణార్చన నిర్వహించే అర్చకుడిపై వేటు వేస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది. అతడిని ఈఓ మెమోలు జారీ చేయడం జరిగింది.

ప్రస్తుత బాధ్యతలను నుంచి అర్చకుడిని తప్పించి అతడిని అంతర్గతంగా బదిలీ చేశారు. పల్లకి సేవ, దర్బార్ సేవ, లక్ష కుంకుమార్చన పర్యవేక్షణ వంటి బాధ్యతలను అర్చకుడికి అప్పగించారు. అదే విధంగా స్టోర్, పూజల విభాగాల ఉద్యోగులను వివరణ కోరుతూ ఆలయాధికారులు ఆదేశాలను జారీ చేశారు. మరో రెండు రోజుల వ్యవధిలో సంబంధిత నివేదికను దేవాదాయ శాఖ కమిషనరుకు ఈఓ పంపనున్నారని అధికారులు తెలిపారు. ఇకపై కనకదుర్గమ్మ దేవస్థానంలో జరిగే అన్ని అభిషేకాలు, పూజలకు తప్పనిసరిగా ఆవు పాలను మాత్రమే వినియోగించాలని ఈ మేరకు ఆదేశించారు. సంప్రదాయాలకు కట్టుబడి, శాస్త్రోక్తంగా మాత్రమే పూజలను నిర్వహించాలని ఈఓ స్పష్టం చేశారు.

Next Story