- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంత్రులు ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ కాదు

దిశ, డైనమిక్‌బ్యూరో : వేగవంతమైన పనితీరుతో సత్వర ఫలితాలు సాధిద్దాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఈ రోజు ట్విట్టర్ వేదికగా ఓ లేఖ విడుదల చేశారు. ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాం. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే...మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్దివైపు అడుగులు వేస్తున్నాం అని వెల్లడించారు. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం అని హామీ ఇచ్చారు.
అయితే ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలని ఆయన సూచించారు. టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని తాను విశ్వసిస్తానన్నారు. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప.. విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేమన్నారు. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే తమ ఆలోచన అని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చామన్నారు. దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. ఎవరినీ తక్కువ చేయడానికి కాదన్నారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇది అని ఆయన పేర్కొన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో తాను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నారు. ‘పీపుల్ ఫస్ట్’ విధానంతో తాను, కేబినెట్ సహచర మంత్రులంతా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నాము. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి... సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలం అని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.