ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రుల సమావేశం ప్రారంభం

by Malleboina Mahesh |

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు సమావేశం అయింది. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్ చర్చలు ప్రారంభించారు

ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రుల సమావేశం ప్రారంభం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు సమావేశం అయింది. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్ చర్చలు ప్రారంభించారు. ప్రధానంగా పెండింగ్ బకాయిలు, పిఆర్సి వంటి వాటిపై సానుకూల నిర్ణయాలు ఉంటాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆశిస్తున్నారు. దీపావళికి ముందుగానే ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఆశతో ఉన్నారు. నాలుగు డిఏలలో ఒకటి విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే 12వ పిఆర్సి కమిషన్‌ను ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్ వస్తోంది. ప్రస్తుతం ఏపీ సచివాలయంలో ఈ చర్చలు ప్రారంభం అయ్యాయి. ఇవి కొలిక్కి వచ్చాక ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

దీపావళికి మరో రెండు రోజులపాటు సమయం ఉండటంతో ఈ రోజు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 14 ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. మరోవైపు ఉద్యోగుల ఆర్థికపరమైన డిమాండ్లపై సీఎం చంద్రబాబు ఇప్పటికే సమీక్ష జరిపారు. ఉద్యోగుల పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం చూపాలని సూచించారు. దీంతో ఆర్థిక శాఖ రంగంలోకి దిగింది. సీఎం చంద్రబాబుకు ప్రత్యేక నివేదిక ఇచ్చింది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించింది. ఇటీవల కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 270 వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందుకే ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక శాఖ చెబుతోంది.

ప్రభుత్వ ఆదాయంపై ఇప్పటికే ఒక అంచనాకు రాలేమని ఆర్థిక శాఖ చెప్పినట్లు సమాచారం. దీనికి ఇంకొంత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఉద్యోగులు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని.. అందుకే వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఉద్యోగులు బాధిత వర్గంగా మారిన విషయాన్ని గుర్తు చేశారట. అయితే ఒక పెండింగ్ డిఏ విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. దీపావళి కానుకగా ఈ డి ఏ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి సంబంధించి నివేదిక సీఎం చంద్రబాబుకు చేరనుంది. అటు తర్వాత ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

అయితే ఉద్యోగులు తమకు 11వ పిఆర్సి బకాయిలు, పెండింగ్‌లో ఉన్న నాలుగు డిఏల్లో రెండు డిఏలు చెల్లించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. 2024లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు 25 వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ బకాయిల్లో 7500 కోట్లను చెల్లించింది. అయితే ఇప్పటికీ ఆ బకాయిలు 30 వేల కోట్ల రూపాయలకు పెరిగినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అందుకే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి.

Next Story