- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రేషన్ డీలర్లకు ఉపాధి కల్పిస్తున్నాం’.. మంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఈ రోజు(జూన్ 1) నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ చేస్తున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఈ రోజు(జూన్ 1) నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇవాళ రేషన్ షాపులు ప్రారంభించి అర్హులైన లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో రేషన్ షాపును ప్రారంభించి, కార్డుదారులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేశారు.
ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ.. రేషన్ వాహనాలపై ప్రజలు, రేషన్ డీలర్ల నుంచి అనేక రకాలైన ఫిర్యాదులు రావడం, బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వచ్చాయని తెలిపారు. వ్యాన్ వచ్చే వరకు పనులు మానుకుని కూర్చుంటున్నామని ప్రజలు చెప్పిన నేపథ్యంలో రేషన్ షాపుల్లోనే సరుకులు అందించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. వాహనాల కారణంగా ఏ విధంగా బియ్యం పక్కదారి పడుతోందో కాకినాడ పోర్టులో బియ్యం దందా బయటపెట్టాం. ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు షాపుకు వెళ్లి సరుకులు తెచ్చుకునే వెసులుబాటు కల్పించినట్లు మంత్రి తెలియజేశారు.
అదే సమయంలో దగ్గరలో ఏ షాప్ ఉంటే ఆ షాపులో రేషన్ తీసుకునే అవకాశం కల్పించాం. ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం, అర కిలో పంచదార, కిలో కందిపప్పు అందిస్తున్నాం. 65 సంవత్సరాలు దాటిన వారికి ఇంటి వద్దకే రేషన్ అందించనున్నాం. రాష్ట్రంలో 1.47 కోట్ల కార్డులున్నాయి. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు సులువైన మార్గం రూపొందించమని మంత్రి తెలిపారు. వాట్సప్ ద్వారానే కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చు. గత ఐదేళ్లు పడిన అవస్థలు పడకుండా చూసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం నడుచుకుంటుంది. బియ్యానికి బదులు చిరుధాన్యాలు అందించేలా కూడా సన్నాహాలు చేస్తున్నాం. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.






