అండగా ఉండండి: మత్య్సకారులకు మంత్రి సవిత పిలుపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-29 12:20:13  IST  )

తెలివికి, ధైర్యానికి మారుపేరు మత్యకారులని మంత్రి సవిత అన్నారు..

అండగా ఉండండి: మత్య్సకారులకు మంత్రి సవిత పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: తెలివికి, ధైర్యానికి మారుపేరు మత్యకారులని, సముద్రంతో పోరాడి చేపలను వేటాడి సమాజానికి అందిస్తారని మంత్రి ఎస్. సవిత(Minister S Savitha) అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో గురువారం ఏపీ మత్స్య సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్ కాఫ్) చైర్మన్, పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా సవిత మాట్లాడుతూ మత్స్యకారులు(Fishermen) ఎప్పటి నుంచో తమ ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారు చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు. బీసీలంటే తమ ప్రభుత్వమని.. దివంగత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి రామారావు(NT Ramarao) చెప్పిన మాటలను ఆమె గుర్తు చేశారు. బీసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chief Minister Nara Chandrababu Naidu) ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని సవిత తెలిపారు.

మత్స్యకారుల భృతిని...

మత్స్యకారుల భృతిని రూ.10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచామని మంత్రి సవిత చెప్పారు. గతంలో 9 మత్స్యకార గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి, అందులో 47% రిజర్వేషన్లు మత్స్యకార బిడ్డలకే ఇచ్చామని గుర్తు చేశారు. డీజిల్ సబ్సిడీ, వలలు, పడవలు, ఐస్ బాక్స్ లు, మోపెడ్లపై సబ్సిడీలను అందిస్తున్నట్లు తెలిపారు. చేపల పెంపకం, విక్రయాల్లో మహిళలకు 60% సబ్సిడీ అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. చేపలు, రొయ్యలు వంటి ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ, ఉత్పత్తితో పాటు వినియోగాన్ని కూడా పెంచాలని పిలుపునిచ్చారు. మత్స్యకారులందరూ ఈ కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉండాలని మంత్రి సవిత తెలియజేశారు.

Next Story