అసెంబ్లీకి రా చర్చిద్దాం: జగన్‌కు మహిళా మంత్రి సవాల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-21 13:22:52  IST  )

వైఎస్ జగన్ అయిదేళ్ల పాలనపైనా, కూటమి ప్రభుత్వం 19 నెలల పాలనపైనా అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సవిత సవాల్ విసిరారు..

అసెంబ్లీకి రా చర్చిద్దాం: జగన్‌కు మహిళా మంత్రి సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(Ys Jagan) అయిదేళ్ల పాలనపైనా, కూటమి ప్రభుత్వం 19 నెలల పాలనపైనా అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సవిత(Minsiter Savitha) సవాల్ విసిరారు. జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే, పులివెందులపైనా, అభివృద్ధిపైనా, సంక్షేమంపైనా, వారు చేస్తున్న అన్ని ఆరోపణలపైనా చర్చకు రెడీ అన్నారని ఆమె తెలిపారు. నిబంధనల ప్రకారం జగన్‌కు మైక్ ఇస్తామని, ఆయన ఏ అంశంపైనైనా మాట్లాడొచ్చునని తెలిపారు. రప్పా..రప్పా... అంటూ అధికారులను, పోలీసులను, ప్రజలను వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని, రాష్ట్రంలో ఏ ఒక్కరూ వారిని ఎవరూ పట్టించుకోవడం లేదని మంత్రి సవిత ఎద్దేవా చేశారు.

త్వరలో మరికొన్ని వైసీపీ అక్రమాలు వెలుగులోకి...

‘‘అధికారంలో ఉన్న సమయంలో జగన్ తన ప్రచార యావ కోసం వేట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేశారు. కుల ధ్రువీకరణ పత్రాలపైనా, సర్వే రాళ్లపైనా, విద్యార్థులకిచ్చిన స్కూల్ బ్యాగ్ లపైనా తన ఫొటో పెట్టుకున్న ఘనుడు. ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు వేసుకున్నారు. పట్టాదారు పాస్ బుక్ లపైనా జగన్ ఫొటో చేయడంతో రైతులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తమ భూములపై తమకు హక్కు లేకుండా పోతోందేమోనని ఆవేదనకు గురయ్యారు. అయిదేళ్ల జగన్ పాలనలో ఎన్నో అక్రమాలు చోటుసుకున్నాయి. అవన్నీ ఒక్కొక్కటికీ బయటపడుతున్నాయి. త్వరలో మరికొందరు గజదొంగల వివరాలు బయటకు రానున్నాయి. వారందరిపైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.’’ అని మంత్రి సవిత హెచ్చరించారు.

Next Story