- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్యశాఖలోనూ 'అవేర్' సేవలు
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడానికి అవేర్ విభాగం సేవలను వినియోగించుకోనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సీజనల్ డిసీజెస్‌ను రియల్ టైమ్‌లో పర్యవేక్షించి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడానికి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)లోని అవేర్ విభాగం సేవలను వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల ప్రకారం రాష్ట్రంలో వ్యాధులు ప్రబలకుండా సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా వైద్య, ఆరోగ్యశాఖ అడుగులు వేస్తోందని చెప్పారు. ఇందుకోసం ఆర్టీజీఎస్‌లోని అవేర్ (అడ్వాన్స్ వార్నింగ్ అడ్వైజరీ ఫర్ రిసిలియెంట్ ఎకోసిస్టమ్) ద్వారా రాష్ట్రంలో వ్యాధుల తీవ్రత, వ్యాప్తికి ఉన్నఅవకాశాలను ప్రాథమిక దశలోనే గుర్తించి వాటిని సత్వరం నివారించే దిశగా త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు.
ఐదారు సంవత్సరాల డేటా ఆధారంగా
గత ఐదారు సంవత్సరా ల్లో (హిస్టారికల్ డేటా) గ్రామాలు, సచివాయాలయాల వారీగా అంటువ్యాధులు (డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఇతర) కేసెస్ డేటా ఆధారంగా విశ్లేషిస్తారు. అలాగే వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యాప్తి చెందే సీజనల్ డిసీజెస్ కు సంబంధించి ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలకు ఆర్టీజీఎస్‌లోని సాంకేతిక సదుపాయాలను వినియోగించుకోనున్నారు. ఆర్టీజీఎస్ సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులకు అవగాహన కలిపించారు.
ముందస్తు అంచనా
ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులను పసిగట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేస్తుంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఇప్పుడు మారుతున్న వాతావరణాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలగలవో డేటా విశ్లేషణతో అవేర్ విభాగం ద్వారా ముందస్తుగానే పసిగట్టి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందన్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఇతర కేసులను సచివాలయాలు వారిగా గుర్తిస్తామని చెప్పారు. ఇందుకు ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు (జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్) కూడా పరిగణలోనికి తీసుకుంటామని తెలిపారు. గత ఐదారు సంవత్సరాల్లో నమోదైన కేసులు వివరాలను కూడా అనుసంధానం చేస్తామని తెలిపారు తద్వారా ప్రాంతాల్లోని పరిస్థితులపై పూర్తి అవగాహన వస్తుందని పేర్కొన్నారు.
టీకాల గురించి..
మాతాశిశు ఆరోగ్యం, సీజేరియన్లు, టీకాలు వేయించుకునే శిశువులు తదితర వివరాలను గ్రామ, సచివాలయాల వారీగా వివరాలు సిద్దం చేస్తున్నారు. సైక్లోన్ సమయంలో సదరు ప్రాంతాల్లోని హైరిస్క్ గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవేర్ బాగా ఉపయోగపడుతుందని మంత్రి సత్యకుమార్ వివరించారు.
ఇతర శాఖలతో అనుసంధానం
ఆర్టీజీఎస్ ఆధ్వర్యంలో నడిచే అవేర్ ప్లాటుఫాం వేదికగా వ్యవసాయ, మత్స్య శాఖలు, పర్యావరణం కాలుష్యం, వాటర్ అండ్ రిజర్వాయర్ మేనేజుమెంటు, శాటిలైటు డేటా బేస్డ్ మానిటరింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇతర శాఖలతో అనుసంధానం చేశారు.






