రెండు రాష్ట్రాల్లో మార్పు అవసరం: మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-12 13:36:03  IST  )

మహిళలకు చట్ట సభల్లో తగిన ప్రాధాన్యత కల్పించే దిశగా ‘నారి శక్తి వందనం’ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో పార్లమెంట్‌లో ఈ బిల్లుపై చర్చ జరగనుందని వెల్లడించారు. ..

రెండు రాష్ట్రాల్లో మార్పు అవసరం: మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ప్రతినిధి విశాఖపట్నం: మహిళలకు చట్ట సభల్లో తగిన ప్రాధాన్యత కల్పించే దిశగా ‘నారి శక్తి వందనం’ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో పార్లమెంట్‌లో ఈ బిల్లుపై చర్చ జరగనుందని వెల్లడించారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎం.ఎం.ఎన్ పరుశురామరాజు అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, దేశంలో మహిళలు సగానికి పైగా ఉన్నప్పటికీ చట్ట సభల్లో వారి ప్రాతినిధ్యం కేవలం 13 శాతమేనని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో మహిళలు తమ ప్రతిభను నిరూపించుకున్నారని అన్నారు. జనధన్ ఖాతాలు, స్టార్ట్ అప్, స్టాండ్ అప్ పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడినట్టు చెప్పారు. మహిళా సాధికారత మాటల్లో కాకుండా కార్యరూపంలో చూపించాలని ఎన్‌డీఏ కూటమి సంకల్పంతో ఉందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విజయవంతం కావాలని, వచ్చే ఎన్నికల నుంచే అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.

ప్రతిపక్షాలపై మండిపాటు

ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన మంత్రి.. కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు కూడా దాటలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ విమర్శలు చేయడం ఆశ్చర్యకరమన్నారు. రాష్ట్రంలో గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి పెట్టుబడులపై వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండించారు. భోగాపురం ప్రాజెక్టును ఐదేళ్లు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు తమదేనని చెప్పడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ పశ్చిమ బెంగాల్, తమిళనాడులో పాలన మార్పు అవసరమని పేర్కొన్నారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఉన్న చోట కూటమి అగ్రనేతలు ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభ పక్షనేత పి. విష్ణుకుమార్ రాజు, టిడిపి జిల్లా అధ్యక్షుడు సిహెచ్ పట్టాభి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి యు. సుజాత రాజ్, మహిళా నేతలు ఎన్. జ్యోతి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Next Story