రాజీపడే ప్రసక్తే లేదు: మంత్రి సత్య కుమార్ యాదవ్

by Vemula.Srinu Prasad |

గుంటూరులో నూతనంగా నిర్మించిన లలిత హాస్పిటల్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ సేవా నిరతితో, మానవతాభావంతో వైద్య సేవలు అందించాలని సూచించారు..

రాజీపడే ప్రసక్తే లేదు: మంత్రి సత్య కుమార్ యాదవ్
X

దిశ, గుంటూరు ప్రతినిధి: గుంటూరులో నూతనంగా నిర్మించిన లలిత హాస్పిటల్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ సేవా నిరతితో, మానవతాభావంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. హృదయ సంబంధిత వ్యాధులతో ఏటా 32 శాతం మంది మరణిస్తున్న నేపథ్యంలో, ఆయా వ్యాధులను గుర్తించే ఖరీదైన ఆధునిక పరికరాలను లలిత హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వైద్య రంగంలో వినూత్న విధానాలతో పేద ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నదని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల ఆహారపు అలవాట్లు మార్చేందుకు, ఒత్తిడి లేని ఆధునిక సమాజ నిర్మాణానికి కృషి చేస్తుందన్నారు. సంజీవిని పథకం ద్వారా 42 రకాల వైద్య పరీక్షలను ప్రజలకు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. రోజు రోజుకి క్యాన్సర్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా క్యాన్సర్ పరీక్షలను సైతం ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు.

అలాగే గుండెజబ్బులతో బాధపడే రోగులకు 45 వేల రూపాయలు ఖరీదు చేసే ఇంజక్షన్‌ను ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల మందికి పైగా ఉచితంగా అందించామన్నారు. గత ప్రభుత్వం అవలంబించిన మద్యం విధానాల వల్ల వివిధ రకాల రోగుల శాతం విపరీతంగా పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని విప్లవాత్మక విధానాలతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తున్నారన్నారు. ఎన్‌టిఆర్ వైద్య సేవ ద్వారా లబ్ది పొందుతున్న పేదల సంఖ్య 12 లక్షలు నుంచి 20 లక్షలు వరకు పెరగడమే నిదర్శనమన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక నెట్వర్క్ హాస్పిటల్స్‌కు దాదాపు 7 వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేసామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ వారి తలసరి అదాయాన్ని పెంచి, వికసిత భారత్ నిర్మాణంలో పాలు పంచుకుంటామని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు.

Next Story