ఆ ముగ్గురిని వదలనంటున్న మంత్రి ఆర్‌కే రోజా: కోర్టులో పరువు నష్టం దావా

by Seetharam |
ఆ ముగ్గురిని వదలనంటున్న మంత్రి ఆర్‌కే రోజా: కోర్టులో పరువు నష్టం దావా
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మంత్రి ఆర్‌కే రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టైయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న సంగతి తెలిసిందే. మంత్రి ఆర్‌కే రోజా సైతం బండారు సత్యనారాయణ మూర్తిని వదిలేది లేదు అని హెచ్చరిస్తున్నారు. పరువు నష్టం దావా వేయడంతో పాటు అవసరమైతే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించి తానేంటో చూపిస్తానని శపథం చేసిన సంగతి తెలిసిందే. మంత్రి ఆర్‌కే రోజా తాను అన్నట్లుగానే టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తికి చుక్కలు చూపించేందుకు రెడీ అవుతున్నారు. తనపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ మంత్రి రోజా నగరి కోర్టులో పరువునష్టం కేసు పెట్టారు. మంత్రి ఆర్‌కే రోజా తన న్యాయవాదులతో కలిసి నగరి కోర్టులో ఫిర్యాదు చేశారు.

నా వ్యక్తిత్వాన్ని దిగజార్చే వారికి బుద్ధి చెప్తా

మహిళలను ఏమైనా అనొచ్చు అనుకునే బండారు సత్యనారాయణ మూర్తిలాంటి మగవాడికి బుద్ధి చెప్పాలని తాను నిర్ణయించుకున్నట్లు మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. తనలాంటి ఒక మంత్రిని, ఒక ప్రముఖ నటిని అయిన తనను ఎదుర్కొనలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కొనలేక పిచ్చిపిచ్చిగా వాగుతున్న బండారు సత్యనారాయణ, భాను ప్రకాశ్, ఓ మీడియా ప్రతినిధిలను వదిలిపెట్టేలది లేదని మంత్రి ఆర్‌కే రోజా హెచ్చరించారు. గతంలోనే వీళ్లందరినీ హెచ్చరించానని అందులో భాగంగానే నగరి కోర్టులో పరువు నష్టం దావా కేసు పెట్టినట్లు వెల్లడించారు.‘నేను, నా కుటుంబం సమాజంలో తిరగకూడదు, మేం ఆత్మహత్య చేసుకోవాలి. ఈ రాజకీయాల నుంచి మేం కనిపించకుండా పోవాలి’ అనే క్రిమినల్ ఉద్దేశాలతో తన పట్ల టీడీపీ నేతలు దురుద్దేశంగా ప్రవర్తిస్తున్నారని రోజా ఆరోపించారు. పక్కా ప్రణాళికతో ప్రెస్ మీట్లు పెట్టి తన వ్యక్తిత్వాని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తన గౌరవానికి భంగం కలిగేలా వారు మాట్లాడుతున్న మాటలు చాలా బాధాకరమన్నారు. వీటిని ఎలాగైనా అరికట్టాలన్నదే ఉద్దేశంతో కోర్టులను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. ఒక మంత్రిగా ఉన్న తనపట్ల ఇలా అసభ్యకరంగా మాట్లాడితే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటని నిలదీశారు. తాను చట్టాలను గౌరవిస్తానని..న్యాయాన్ని నమ్ముతాను కాబట్టి వాళ్లపై న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు.

Next Story