ప్రభుత్వ ప్రయత్నాలకు సహకరించండి: రాష్ట్ర మహిళలకు మంత్రి రిక్వెస్ట్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో మహిళల సాధికారతకు బాటలు వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికను రూపొందించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు..

ప్రభుత్వ ప్రయత్నాలకు సహకరించండి: రాష్ట్ర మహిళలకు మంత్రి రిక్వెస్ట్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మహిళల సాధికారతకు బాటలు వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికను రూపొందించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సామాజిక, ఆర్థిక పరిమితుల వల్ల వివక్షకు గురవుతున్న మహిళలకు సమాన అవకాశాలు కల్పించి రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కల్పించడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. జనాభా స్థిరీకరణలో మహిళల పాత్ర కీలకమని గుర్తించిన ప్రభుత్వం, గర్భధారణ నుంచి శిశు సంరక్షణ వరకు మహిళలకు అన్ని దశల్లో మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. లింగ వివక్షను తొలగిస్తూ మహిళా శక్తి సమాజ అభివృద్ధిలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

పది సూత్రాలతో మహిళా సాధికారత....

మహిళలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం, సంతాన ప్రాప్తి హక్కును రక్షించడం, ఆర్థిక స్వావలంబనకు అడ్డంకులను తొలగించడం, శిశు సంరక్షణలో పురుషుల భాగస్వామ్యాన్ని పెంచడం వంటి అంశాలు ఈ ప్రణాళికలో ముఖ్యంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.

పని ప్రదేశాల్లో సదుపాయాలు....

50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. పట్టణ ప్రాంతాల్లో ప్రతి లక్ష జనాభాకు ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అదనంగా, ప్రస్తుతం ఉన్న 180 రోజుల ప్రసూతి సెలవులను 12 నెలల పేరెంట్ హుడ్ లీవ్‌గా మార్చి తల్లిదండ్రులిద్దరూ వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి చెప్పారు.

సంతానోత్పత్తి సేవలు ఉచితం....

రాష్ట్రంలో సంతాన సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు ఉచితంగా సంతానోత్పత్తి సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సంవత్సరం 50 వేల కుటుంబాలకు ఈ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇందుకోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్త్’ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

మాతా, శిశు ఆరోగ్యంపై దృష్టి....

పిన్న వయసులో గర్భధారణ, పోషకాహార లోపం, అధిక సిజేరియన్ ప్రసవాల వంటి సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. ఐదేళ్లలో సిజేరియన్ శాతం 40కు తగ్గించడం, పిన్న వయసు గర్భధారణను 3 శాతానికి తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

కేర్ ఎకానమీకి ప్రోత్సాహం....

శిశు, వృద్ధాప్య సంరక్షణ సేవల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి సంవత్సరం 5 వేల మంది సేవా సిబ్బందిని తయారు చేసి, వారికి శిక్షణ, సర్టిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

మహిళల శ్రామిక భాగస్వామ్యం పెంపు

ప్రస్తుతం మహిళల వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ 31 శాతం మాత్రమే ఉండటంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని 61 శాతానికి పెంచితే రాష్ట్ర ఆర్థిక వృద్ధి 15 శాతం పెరుగుతుందని తెలిపారు. మహిళలకు అనుకూలంగా సడలింపులతో కూడిన పని వేళలు, వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను పెంచుతామని చెప్పారు. మహిళలకు సంపూర్ణ ఆరోగ్య రక్షణ, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా వారి సాధికారతను పెంచి, జనాభా స్థిరీకరణ లక్ష్యాలను సాధించవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రయత్నాలకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story