- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హౌసింగ్ శాఖపై మంత్రి పార్థసారథి సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు
గతంలో హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది పేద లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, హౌసింగ్ అక్రమాలపై ఉక్కు పాదం మోపాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్‌గా మాట్లాడారు. ..

దిశ, కడప ప్రతినిధి: గతంలో హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది పేద లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, హౌసింగ్ అక్రమాలపై ఉక్కు పాదం మోపాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్‌గా మాట్లాడారు. శనివారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంత్రి కొలుసు పార్థసారథి స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డితో కలిసి జిల్లా హౌసింగ్, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో హౌసింగ్ లే అవుట్లలో గృహ నిర్మాణాల పురోగతి, పెండింగ్ పనులు, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రి, గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించబోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు, సిబ్బంది చేసిన నిర్వాకం వల్ల పేదలు నష్టపోయారని పేదల కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. జరిగిన ప్రతి అక్రమంపై విచారణ జరిపి స్వాహా చేసిన కోట్ల రూపాయలను తిరిగి రికవరీ చేయాలని మంత్రి ఆదేశించారు.
మెప్మా మహిళా సంఘాలు, హౌసింగ్ నిర్మాణాలకు సంబంధించిన నిధుల వినియోగంపై వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావిస్తూ, ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు.స్వహా చేసిన సొమ్ము రికవరీ చేయాలని ,బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని బొల్లవరం, రామేశ్వరం, మీనాపురం హౌసింగ్ లేఅవుట్లలో ఇంకా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న సెప్టెంబర్–అక్టోబర్ నాటికి పెండింగ్ గృహాలన్నీ పూర్తి చేసి లబ్ధిదారులు కాలనీల్లో నివాసం ఉండేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
అధికారులపై అసంతృప్తి
ఈ సందర్భంగా అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, "ప్రభుత్వం జీతాలు ఇస్తోంది ప్రజలకు సేవ చేయడానికి.. ఫైళ్లను పెండింగ్‌లో పెట్టడానికి కాదు. ఇకపై నిర్లక్ష్యం, అలసత్వం అస్సలు సహించం. లక్ష్యాలు చేరుకోలేకపోతే ఉద్యోగాలు వదిలి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితులు తెచ్చుకోవాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు.
సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని హౌసింగ్ లబ్ధిదారుల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుందని, పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించి పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు.






