ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి: పెట్టుబడిదాలకు మంత్రి గుడ్ న్యూస్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-12 11:40:46  IST  )

పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలంగా ఉందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మంత్రి పార్థసారధి పిలుపునిచ్చారు....

ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి: పెట్టుబడిదాలకు మంత్రి గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం అనుకూలంగా ఉందని, ఈ అవకాశాన్ని పెట్టుబడిదారులు అందిపుచ్చుకుని పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని మంత్రి కొలుసు పార్థసారధి పిలుపునిచ్చారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్‌లో మూడు రోజులపాటు నిర్వహించే ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్ పో 2025‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేవారి కోసం సింగిల్ విండో ద్వారా 21 రోజుల లోపుగానే ప్రభుత్వం అనుమతులు ఇస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక విధానాలు, పెట్టుబడులకు అనుకూల వ్యవస్థ, విజనరీ లీడర్ షిప్ కారణంగా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ప్రభుత్వం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ బిజినెస్ నినాదంతో ముందుకు సాగుతోందన్నారు. పరిశ్రమలు స్థాపనకు పెట్టుబడిదారులు ఆలోచన చేయగానే వారి అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా వారికి మార్గనిర్దేశానికి సింగిల్ విండో విధానంతో ప్రభుత్వం చురుగ్గా అనుమతులు ఇస్తుందన్నారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొనటం ద్వారా యువతకు లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు.

దేశంలోనే మొట్టమొదటి క్వాంటం దిశగా అడుగు..

క్వాంటం సాంకేతికతలో రాష్ట్రం విప్లవాత్మకమైన ముందగుడు వేసిందని, ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటగా క్వాంటం కంప్యూటర్‌ను స్థాపించబోయే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గర్వంగా ఉందని మంత్రి తెలిపారు. క్వాంటం అభివృద్ధికి కేంద్రం కేటాయించిన రూ. లక్ష కోట్ల నిధిని ఉపయోగించుకుంటున్న మొట్టమొదటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ అని మంత్రి అన్నారు. కేవలం క్వాంటం కంప్యూటర్‌ను దిగుమతి చేసుకోవడమే కాకుండా క్వాంటం కంప్యూటర్‌ను రాష్ట్రంలోనే తయారు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పెట్టుబడులకు భద్రత కల్పించటంలో భాగంగా ఎస్క్రో ఖాతా ద్వారా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలను (Incentives) సకాలంలో అందించడానికి ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం తీసుకోని విధంగా, పరిశ్రమలకు ఎస్క్రో అకౌంట్ (Escrow Account) ను తెరవడం జరిగిందన్నారు. దీని ద్వారా గతంలో మాదిరిగా ప్రోత్సాహకాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదని, నిర్ణీత సమయంలోనే ప్రోత్సాహకాలు అందుతాయని అని అన్నారు.

సమగ్ర పారిశ్రామిక విధానాలు..

రాష్ట్రంలో సమగ్ర పారిశ్రామిక విధానాలు అందుబాటులో ఉన్నాయని 972 కిలోమీటర్ల తీర ప్రాంతం, సహజసిద్ద సారవంతమైన భూములు, మానవ వనరులతో పాటు 25కు పైగా సమగ్ర విధానాలను (Policies) తీసుకొచ్చిందన్నారు. వీటిలో ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఐటీ, క్వాంటం, మౌలిక సదుపాయాల రంగాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎన్డీఏ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులు, సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నూజివీడు నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయా రంగాల్లో ఇతోధికంగా పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

Next Story