- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క రూపాయి ఇవ్వకుండా గుండ్రేవులను గాలికొదిలేశారు: జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్
రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ నాటి సీఎం జగన్ ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా గుండ్రేవులను గాలికొదిలేసారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు..

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ నాటి సీఎం జగన్ ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా గుండ్రేవులను గాలికొదిలేసారని మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) మండిపడ్డారు. నేరడి, గుండ్రేవుల ప్రాజెక్టు(Neradi and Gundrevula Project)ల పురోగతిపై ఏపీ శాసన మండలి(AP Legislative Council)లో సభ్యులు అడిగన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది నుంచి 34 టిఎంసిల నీటిని వినియోగించుకునేలా నేరడి బ్యారెజీని రూపొందించడం జరిగిందని చెప్పారు. నేరడి బ్యారేజీకి సంబందించి ఒడిశా రాష్ట్రంతో ఉన్న వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఒడిశా రాష్ట్రంతో వివాదాన్ని పరిష్కరించేలా ఇటీవలే సీఎం చంద్రబాబు కేంద్రజలశక్తి మంత్రిని కలిశారని గుర్తు చేశారు.
నెరడి బ్యారేజీ నిర్మాణాన్ని ప్రారంభించడానికి వీలుగా, ట్రిబ్యునల్ తీర్పును త్వరగా అధికారిక గెజిట్‌లో ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని జలశక్తి మంత్రిని కోరామని చెప్పారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు, కేసీ కెనాల్‌కు, సాగు నీరందించేలా తుంగభద్ర నదిపై 20 టీఎంసీ ల నీటి నిల్వ సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్ ప్రతిపాదన పెట్టామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రూ. 2890 కోట్లతో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందని తెలిపారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సమ్మతి తీసుకునేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో ఈ ప్రాంత ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన లోకేష్ కు ఈప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ద ఉందన్నారు. రాయలసీమ కు సాగు, తాగు నీరందించే ప్రాజెక్టులను రద్దుచేసి, జగన్ సీమ ద్రోహిగా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయారని పేర్కొన్నారు. 2024 లో గుండ్రేవుల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ..4,530 కోట్లకు చేరుకుందని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.






