- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయలసీమకు ఎవరు ద్రోహం చేశారో అందరికీ తెలుసు : మంత్రి నిమ్మల
రాయలసీమకు ఎవరు ద్రోహం చేశారో అందరికీ తెలుసని, లిఫ్ట్ ఇరిగేషన్ పై మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు కూటమి మంత్రులు.

దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమకు ఎవరు ద్రోహం చేశారో అందరికీ తెలుసన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా బదులిచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో రాయలసీమ ప్రాంతంలో ఏ ప్రాజెక్టునూ పట్టించుకోలేదని విమర్శించారు. గోరకల్లు రిజర్వాయర్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వని వైసీపీ నేతలు.. నేడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో హంద్రీనీవాకైతే తట్ట మట్టి కూడా వేసిన పాపాన పోలేదన్నారు. ఆఖరికి మోటార్ల బిల్లులు కూడా చెల్లించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాయలసీమను అభివృద్ధి చేసి చూపించామన్నారు. రాయలసీమకు ద్రోహం చేసిందే జగన్ అని విమర్శించారు.
అనంతరం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూటమినేతలు సమాధానం చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సహా.. ఆ పార్టీ సభ్యులంతా డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ - కూటమి నేతల మధ్య వాగ్యుద్ధం జరిగింది. తాను చెప్తేనే లిఫ్ట్ పనులు ఆపివేశారన్న తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలకు కూటమి నేతలు కట్టుబడి ఉన్నారా అని బొత్స ప్రశ్నించడంతో మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై టీడీపీ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఇరిగేషన్ పై మాట్లాడే హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ హయాంలో జేబులు నింపుకునే పనులు మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారని మంత్రి నిమ్మల ఆరోపించారు. సీఎంపై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ సభ్యులు క్షమాపణలు చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. ఇరు సభ్యుల ఆందోళనతో మండలి సమావేశాన్ని ఛైర్మన్ కొద్దిసేపు వాయిదా వేశారు.






