వెలిగొండ ఆయకట్టు రైతులకు నీటి విడుదల అప్పుడే?.. మంత్రి నిమ్మల వెల్లడి

by Jakkula.Mamatha |

వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై, అమరావతి సచివాలయంలో బుధవారం ఇరిగేషన్ అధికారులతో, మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వెలిగొండ ఆయకట్టు రైతులకు నీటి విడుదల అప్పుడే?.. మంత్రి నిమ్మల వెల్లడి
X

దిశ,వెబ్‌డెస్క్: వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై, అమరావతి సచివాలయంలో బుధవారం ఇరిగేషన్ అధికారులతో, మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. వెలిగొండ రిజర్వాయర్‌ను వచ్చే ఏడాది(2026) జూన్ నాటికి నింపి.. సదరు ఆయకట్టు రైతులకు నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు తమకు దిశా నిర్దేశం చేశారని మంత్రి నిమ్మల వెల్లడించారు.

వెలిగొండ పై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులు పరుగులు పెట్టిస్తుండగా, గత వైసీపీ హయాంలో వెలిగొండను పూర్తి చేసినట్లు పచ్చి అబద్దాలు ఆడారని విమర్శించారు. జాతికి అంకితం కూడా చేసేశారని అన్నారు. మాజీ సీఎం జగన్ అబద్దాల పాలనకు ఇది పరాకాష్ట అంటూ నిమ్మల దుయ్యబట్టారు. మోసం, దగాతో జనాన్ని భ్రమింప చేయటంలో జగన్‌ను మించిన వారు లేరు అన్నారు. ఇప్పటివరకు 7 వింతలే తెలుసు. చేయని పనులు చేశామని, వాటికి ప్రారంభోత్సవాలు కూడా చేసేయడం ప్రజలు ఎనిమిదో వింతగా భావిస్తున్నారని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు.

ఇదే తరుణంలో పాలనా దక్షత గల సీఎం చంద్రబాబు 30 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు, ఇంకా పూర్తవ్వకపోవడం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి నిమ్మల చెప్పారు. నిర్వాసితులకు 880 కోట్లు పరిహారం అందించాల్సి ఉండగా, జగన్ ఒక్క రూపాయి పరిహారం అందించాలేదని తెలిపారు. వెలిగొండ పూర్తవ్వాలంటే ఇంకా 4వేల కోట్లు కావాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆగిపోయిన వెలిగొండ ప్రాజెక్టు పనులను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.

టన్నెల్‌లో ఉన్న TBM మెషిన్ తొలగించడానికి కోర్టు కేసు అడ్డంకిగా ఉన్న నేపథ్యంలో, బైపాస్ టన్నెల్ నిర్మాణం, సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని వివరించారు. హెడ్ రెగ్యులేటర్, టన్నెల్స్, ఫీడర్ కెనాల్, పునరావాస కాలనీల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏది ఏమైనా 2026 జూన్ కల్లా వెలిగొండ రిజర్వాయర్ నింపి ఆయకట్టు రైతులకు నీరు అందించే దిశగా శక్తివంచన మేరకు కృషి చేస్తున్నామని చెప్పారు.

Next Story