నో వెహికిల్ డే: మరోసారి ప్రత్యేక ఆకర్షణగా మంత్రి నిమ్మల

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-22 09:01:50  IST  )

పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణే ధ్యేయంగా 'నో వెహికిల్ డే' కార్యక్రమం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..

నో వెహికిల్ డే: మరోసారి ప్రత్యేక ఆకర్షణగా మంత్రి నిమ్మల
X

దిశ, వెబ్ డెస్క్: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణే ధ్యేయంగా 'నో వెహికిల్ డే' కార్యక్రమం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాలకొల్లు నుంచి విజయవాడ వరకు సాధారణ ప్రయాణికులతో కలిసి ఆయన రైలులో ప్రయాణించారు. అనంతరం రామవరప్పాడు నుంచి మంగళగిరి వరకు సుమారు 18 కిలోమీటర్ల మేర ఎండను సైతం లెక్కచేయకుండా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి అందరిలో స్ఫూర్తి నింపారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఇలా వరుసగా రెండో వారం కూడా నో వెహికిల్ డే పాటిస్తూ సైకిల్‌పై వెళ్లారు.

ఒకే సైకిల్‌పై మంత్రి నిమ్మల, పల్లా శ్రీనివాస్

మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర తాడేపల్లికి చేరుకోగానే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి ఒకే సైకిల్‌పై కూర్చుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. కేవలం ప్రచార ఆర్భాటాల కోసం కాకుండా, పర్యావరణ స్పృహను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే తాము ఈ విధంగా వాహనాలను పక్కనబెట్టి ప్రయాణించామని నేతలు పేర్కొన్నారు.

జగన్ మావిగన్ అంటే ప్రజలే భయపడుతున్నారు: మంత్రి

మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాజకీయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "జగన్ మావిగన్ (విధ్వంసక ధోరణి) చూసి కూటమి ప్రభుత్వం భయపడట్లేదు.. ఆయన్ను చూసి ప్రజలే భయపడుతున్నారు" అంటూ ఘాటుగా విమర్శించారు. కేవలం అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని, హత్యా రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, గత ప్రభుత్వ పాలకుల వైఖరి మాత్రం ఇంకా మారలేదని నిమ్మల విమర్శించారు.

మంత్రి రైలు ప్రయాణం వీడియో

Next Story